
తాజా వార్తలు
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
‘ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు’’.. - ఇది నిజమే. కానీ, ‘‘ప్రేమ ఉన్న చోటే భయమూ ఉంటుంది’’ అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. ప్రేమిస్తున్నామని చెబితే ఎక్కడ కాదంటారేమోనని.. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయంతో ఎన్నో ప్రేమకథలు గుండె లోతుల్లోనే మిగిలి పోతుంటాయి. అందుకే చాలా మంది ప్రేమించిన మనిషి పక్కనే ఉన్నా.. మనసులోని మాట బయట పెట్టలేక లోలోపల ఓ తీయని చిత్రవధ అనుభవిస్తుంటారు. మరి అలాంటి ఓ ప్రేమికుడి మదిలోని భావాలని.. అందమైన ప్రేమ కావ్యంలా మలిస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా ‘‘కోల కళ్లే ఇలా..’’ గీతమవుతుంది.
‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’, ‘అర్జున్ రెడ్డి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాలకు పాటలందించిన రచయిత రాంబాబు గోసాల కలం నుంచి జాలువారిన మరో ప్రేమ గీతమిది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ చిత్రం కోసం రాశారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు. ఈ గీతం.. మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కోల కళ్లే ఇలా’’ పాట విశేషాల్ని ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారు రాంబాబు.
‘‘ఈ పాట రాసేటప్పుడే నేనెక్కడా ఆంగ్ల పదాలు వాడలేదు. అలతి అలతి తెలుగు పదాలతో కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశా. తొలి పల్లవిని ‘చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే..’ అని వర్ణించా. తర్వాత ‘పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవ్వుతూ నువ్వే నిలుచున్నావే’ అంటూ పల్లవిలో తొలి భాగం పూర్తిచేశా. ఆ వెంటనే ‘కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే’ అని ఆ ప్రేమికుడి మౌన వేదనని ఓ అందమైన ప్రశ్నలా సంధించా. ‘నిశినలా విసురుతూ శశినువ్వై మెరవగా.. మనసులో పదనిసే ముసుగు తీసెనా’ అని పాటలో ఒక లైన్ ఉంటుంది. ఇది మా చిత్ర బృందం మొత్తానికి బాగా నచ్చింది. దీనర్థం.. ‘నిశిని విసిరేస్తూ.. శశిలాగా మెరిస్తే, నా మనసులో ఒక పదనిస మొదలవుతుంది’ అని ప్రేమికుడి భావన. నాకెంతో సంతృప్తినిచ్చిన అల్లిక ఇది. ఈ గీతంలో అసలైన్ సవాల్ హుక్ లైన్ దగ్గర వచ్చింది. ఈ ట్యూన్ చాలా స్లోగా.. క్లాస్ మెలోడీలా సాగిపోతుంటుంది. అయితే పల్లవి పూర్తయ్యే సరికి పాట మరోస్థాయికి వెళ్తుంది. కాబట్టి అక్కడ అందరి మనసుల్లో నాటుకుపోయేలా మంచి హుక్ లైన్ పడాలి. దీనికోసం మొదలై ‘మెల్ల మెల్లంగానే మనసు నీదై పోయే..’ అని రాశా. కానీ, ఇది మరీ సాదాసీదాగా ఉందనిపించింది. అందులోనూ పాటలో మళ్లీ మళ్లీ వినిపించే లైన్ ఇది. అందుకే దాన్ని కొత్తగా, క్యాచీగా చెప్పాలనే ఉద్దేశంతో ‘కోల కళ్లే ఇలా గుండె గిల్లే ఎలా’ అని మార్చి రాశా. ఇప్పుడీ మార్పే పాటకి మరింత సొగసును తెచ్చి పెట్టింది.
రెండో చరణంలో ‘నువ్వెళ్లే దారులలో చిరుగాలికి పరిమళమే.. అది నన్నే కమ్మేస్తూ ఉందే’ అని రాశా. సినిమాలో శౌర్య ఎప్పుడూ రీతూనే అనుసరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అలా నడిచి వెళ్లిపోతుంటే.. ఆ పరిమళం చిరుగాలిలో కలిసి, ఆ గాలి తనని కమ్మేస్తుందని మనసులకు హత్తుకునేలా వర్ణించా. తర్వాత ‘నా కంటి రెప్పలలో కునుకులకిక కలవరమే.. ఇది నన్నే వేధిస్తూ ఉందే’ అంటూ తన మనసు పడుతున్న తీపి వేదనని అందంగా వివరించా’’.
‘‘ఈ పాటకి నేను రెండు వెర్షన్లు రాశా. రెండు రోజులు పట్టింది. పాట రాస్తున్నప్పుడు ఇది సిద్ శ్రీరామ్‌తో పాడిస్తారని నాకు అసలు తెలియదు. ఆయన ఎన్నో హిట్ గీతాలు పాడుతున్నారు.. నా పాట పాడితే బాగుండనని అనుకునేవాడిని. ఆ కోరిక ఇన్నాళ్లకు ‘వరుడు కావలెను’తో తీరింది. ఈ గీతాన్ని లక్ష్మీ సౌజన్య ఎంతో చక్కగా తెరకెక్కించారు. తెరపై చూస్తున్నప్పుడు మరింత అద్భుతంగా అనిపిస్తుంది. ఇటీవల ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా వారింట్లో ఆయనకి ఈ పాట పాడి వినిపించా. వెంటనే ఆయన నా భుజం తట్టి చాలా బాగా రాశావని ప్రశంసించారు. ఆ మాట నా పాటకి వంద కోట్ల వ్యూస్ వచ్చినంత ఆనందాన్నిచ్చింది’’.