మెసెంజర్‌ యాప్స్‌లో ఆ టెక్నాలజీ ఉండదా..?
close

తాజా వార్తలు

Updated : 28/02/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెసెంజర్‌ యాప్స్‌లో ఆ టెక్నాలజీ ఉండదా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెస్సెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రవేశపెట్టనున్న ప్రైవసీ పాలసీ ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తమ వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో.. అలాంటిదేమీ ఉండదని చెబుతూనే ప్రైవసీ పాలసీ నిర్ణయాన్ని మే 15కి వాట్సాప్‌ వాయిదా వేసింది. మరోవైపు సోషల్‌ మీడియా, ఓటీటీలపై కేంద్రం నూతన నియమ నిబంధనలు తీసుకొచ్చిన వేళ యూజర్లలో కొత్త అనుమానాలు నెలకొన్నాయి. ఏదైనా అంశంపై తప్పుడు సందేశాలను పంపి దేశ సౌభ్రాతృత్వం, భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించే యూజర్ల డేటాను తప్పనిసరిగా గుర్తించాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. మెసేజ్‌లను ఎవరూ చూసేందుకు వీలు లేకుండా ఇప్పటి వరకు సోషల్‌ మీడియా నిర్వాహకులు ‘ఎండ్‌ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాబోయే కాలంలో యాప్స్‌ ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌’ను తొలగించాల్సి ఉంటుందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రజల భావస్వేచ్ఛ, ప్రైవసీని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నాయి. 

మా ఉద్దేశం అది కాదు..: కేంద్రం

అయితే ప్రజల్లో నెలకొన్న సందేహాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చాటింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను తెలుసుకోవాలనే ఆకాంక్ష తమకు లేదని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసే అసలైన నిందితుడిని పట్టుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అలాంటి నిందితుడికి ఐదేళ్లకుపైగా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. మెసేజ్‌ను విదేశీ ఖాతా నుంచి వచ్చినప్పుడు ఎవరైతే తొలుత భారత్‌లో షేర్‌ చేస్తారో ఆ యూజరే ఒరిజినేటర్‌గా పేర్కొని శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఒరిజినేటర్‌ను కనుక్కోవడానికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారత్‌లోని యూజర్లకు ‘ఎండ్ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌’ తీసేసే అవకాశం ఉన్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చే నియమాల ప్రకారం భారతీయుల ప్రైవసీకి తీవ్ర విఘాతం కలుగుతుందని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. సైబర్‌ సెక్యూరిటీ వేధింపులు, నేరాలు పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయంపై దేశంలోని యూజర్లు ఏ విధంగా స్పందిస్తారో.. అలానే సోషల్ మీడియా సంస్థలు ఎలాంటి చర్యలు చేపడతాయో వేచి చూడాల్సిందే..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని