close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరద బాధితులకు పరిహారం పెంచాలి

పీసీసీ కోర్‌ కమిటీ ఏకగ్రీవ తీర్మానం
ఏఐసీసీ నిరసన కార్యక్రమాలకు ఇన్‌ఛార్జుల నియామకం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. జరిగిన ఆస్తి, పంట నష్టం సహా తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించింది. వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షల పరిహారం, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2 లక్షల పరిహారం, వరద ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు రూ.50 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఉపశమనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తాన్ని రూ.500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెంచాలంది. ఈ మేరకు ప్రజ్ఞాపూర్‌లో జరిగిన పీసీసీ కోర్‌ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో వరద పరిస్థితి, వ్యవసాయం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో జరిగిన ప్రమాదం, దుబ్బాక ఉప ఎన్నిక సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉత్తమ్‌ బుధవారం ఒక ప్రకటనలో మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్ట నివారణలో, ప్రజలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కోర్‌ కమిటీ ముక్తకంఠంతో ఖండించిందన్నారు.

ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా అక్టోబరు 31న నిర్వహించే కిసాన్‌ అధికార దివస్‌ కార్యక్రమానికి కుసుమకుమార్‌ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై నవంబరు 3న ప్రారంభించనున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్‌ను, మహిళలు-దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నవంబరు 7న తలపెట్టిన మహిళా-దళిత విరోధి దివస్‌కు సంపత్‌కుమార్‌ను, నవంబరు 11న నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి ట్రాక్టర్‌ ర్యాలీ కార్యక్రమానికి భట్టి విక్రమార్కను ఇన్‌ఛార్జులుగా నియమించినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1850కు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో ప్రమాదానికి సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. భారీ వర్షాలతో పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కోర్‌కమిటీలో చర్చించి తీర్మానాలు చేసినట్లు ఉత్తమ్‌ తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.