close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంత్రిమండలి నిర్ణయం సబబే

కొత్త సచివాలయ నిర్మాణంపై ఉల్లంఘనలు లేవు... ఏకపక్షం కాదు
హైకోర్టు స్పష్టీకరణ

కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయం చట్టవిరుద్ధం కాదు. ఏకపక్షం...అసమంజసం కానే కాదు. మౌలిక సదుపాయాల కల్పన అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం. ఏపీ రాజధాని తరలినందున హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కావడంతో భవనాల కేటాయింపు అంశం విభజన చట్టం ప్రకారం గవర్నరుకే ఉంటుందన్న వాదన చెల్లదు.


ప్రస్తుత సచివాలయ భవనం చాలా చోట్ల దెబ్బతిని పునరుద్ధరణకు అవకాశం లేదంటూ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 131 ఏళ్ల కింద నిర్మించిన ‘జి’బ్లాక్‌ కూలిపోయే దశలో ఉందని, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత భవనం లేదని, పలు లోపాలను నివేదికలు ఎత్తిచూపాయని, ఇలాంటి భవనంలో నిర్వహణ కష్టమన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తున్నాం.

-హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: పాత సచివాలయం ప్రాంతంలో కొత్తది నిర్మించాలంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇందులో ఎలాంటి చట్ట, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. అందులోనూ ఇది తుది నిర్ణయం కాదని, మధ్యంతర నిర్ణయమేనని, నివేదికలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. పిటిషనర్ల వాదనతో ఏకీభవించలేమంటూ కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 5 పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేస్తూ 34 పేజీల తీర్పు వెలువరించింది. పాత సచివాలయాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేపట్టాలన్న మంత్రిమండలి తీర్మానాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి, న్యాయవాది రజనీకాంత్‌రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
తగినంత సమాచారం లేదనడంలో వాస్తవం లేదు
కొత్త సచివాలయం నిర్ణయం కేవలం ప్రణాళిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దీనికి ముందు సాంకేతిక కమిటీ, ఐజీబీసీ నివేదికలను కోరామని, ఈ నివేదికలను ఇంకా మంత్రిమండలి ముందుంచలేదని అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారని, అందువల్ల తుది నిర్ణయం తీసుకోవడానికి మంత్రిమండలి ముందు ఎలాంటి సమాచారం లేదన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించలేమంది. 2012, 2013ల్లోనే భద్రతకు సంబంధించి అగ్నిమాపక శాఖ నివేదికలు సమర్పించిందని, 2015లో మంత్రిమండలి ముందుకు ఇదే అంశం చర్చకు వచ్చి కొత్త నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించగా, అప్పుడే పిటిషన్‌లు దాఖలైన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని, అలాంటప్పుడు భవనాల కేటాయింపులో గవర్నరుదే నిర్ణయమన్న పిటిషనర్ల వాదనతో విభేదిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని తరలించినందున గవర్నరు జోక్యం అవసరంలేదంది.  
ఇది సాధారణ నిర్ణయమే
మంత్రిమండలి నిర్ణయం ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నప్పటికీ సాధారణ నిర్ణయమేనని కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక పరమైన విధాన నిర్ణయాల్లో కోర్టు పరిధి చాలా స్వల్పమంది. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాల్లో మార్పులు చేయడం, కూల్చి కొత్త నిర్మాణాలను చేపట్టాలన్న రెండు అంశాలను మంత్రిమండలి పరిశీలించిందని, అయినా ఇది తుది నిర్ణయం కాదని, మధ్యంతరమేనని పేర్కొంది. తీర్మానం పాలనాపరమైన విధాన నిర్ణయమా, కార్యనిర్వాహక నిర్ణయమా అన్నది చూడాలని, నర్మదా బచావో ఆందోళన కేసులో... మౌలిక సదుపాయల కల్పన, నిర్మాణాలు విధాన నిర్ణయమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. అందువల్ల పిటిషనర్లు విధాన నిర్ణయం కాదన్న వాదనతో ఏకీభవించలేమంది. అవసరాలకు ప్రస్తుత భవనాలు సరిపోతాయా లేదా అనే అంశం జోలికి వెళ్లలేమని..అవసరాలకనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.