అందుకే చైనా కాన్సులేట్‌ను మూసివేయించాం

తాజా వార్తలు

Published : 25/07/2020 00:17 IST

అందుకే చైనా కాన్సులేట్‌ను మూసివేయించాం

అమెరికా

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వివాదాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా డ్రాగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం.. ముందు ప్రకటించినట్లుగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. అమెరికాలోని చైనా దౌత్య కార్యాలయాలు గూఢచర్యానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీనికి హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం కేంద్రంగా మారిందని చెప్పారు. అందుకే దాన్ని మూసివేయించామని తెలిపారు. మేధో సంపత్తిని సైతం చైనా దొంగిలిస్తోందన్నారు. తద్వారా కీలక వ్యాపార రహస్యాలనూ ఛేదించి అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు.

చైనా రోజురోజుకీ కొత్త కుట్రలు, దౌర్జన్యాలకు తెరతీస్తోందని మైక్‌ పాంపియో ఆరోపించారు. వీటిని ఎదుర్కొని డ్రాగన్‌ దూకుడును అడ్డుకోవడానికి స్వేచ్ఛాయుత దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సొంత దేశంలో నియంతృత్వ వైఖరిని అవలంబిస్తున్న చైనా.. ఇతర ప్రాంతాల్లోని స్వేచ్ఛను సైతం హరించాలని చూస్తోందన్నారు. పరోక్షంగా హాంకాంగ్‌లో అమలులోకి తెచ్చిన కొత్త చట్టాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛాయుత దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ)ని మార్చాలని వ్యాఖ్యానించారు. లేదంటే సీసీపీయే ప్రపంచాన్ని మార్చివేసే ప్రమాదం ఉందన్నారు. సోవియట్‌ యూనియన్‌, అమెరికా మధ్య యుద్ధాన్ని చైనా అనుకూలంగా మార్చుకుందన్నారు. ఆ సమయంలో పశ్చిమ దేశాల ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా పరిపుష్టం సాధించిందన్నారు.

హ్యూస్టన్‌లోని తమ దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా మంగళవారం తమకు తెలిపిందని స్వయంగా చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరిన్ని చైనా కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని ప్రకటించారు. హ్యూస్టన్‌లోని చైనా కార్యాలయంలో మంటలు చెలరేగాయని..వారు పత్రాలు తగులబెట్టినట్లు భావిస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన చైనా.. ఈ నిర్ణయం ఇరు దేశాల దౌత్య సంబంధాలకు దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని వాదించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే ప్రతీకార చర్యలు ఉంటాయని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని