సోనియా గాంధీ కుటుంబానికి కేంద్రం షాక్‌!

తాజా వార్తలు

Published : 08/07/2020 14:50 IST

సోనియా గాంధీ కుటుంబానికి కేంద్రం షాక్‌!

దిల్లీ: గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్‌ ట్రస్ట్‌ల విషయంలో వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అంతర్‌ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పెషల్‌ డైరెక్టర్‌ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా ఈ కమిటీలో భాగంగా ఉండనుంది. ఈ విషయాల్ని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. 

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(ఆర్‌జీఎఫ్‌), రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లకు వచ్చే నిధుల విషయంలో మనీలాండరింగ్‌, ఎఫ్‌ఆర్‌సీఏ, ఐటీ వంటి చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఆర్‌జీఎఫ్‌కు సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం ట్రస్టీలుగా ఉన్నారు. రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు కూడా సోనియా గాంధీయే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ బాధ్యతల్ని కూడా ప్రస్తుతానికి ఆమే నిర్వహిస్తున్నారు.  

భారత్, చైనా సరిహద్దు వివాదంపై అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినా.. ప్రధాని మోదీ ఆ విషయాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.  మన భూభాగంలో ఎవరూ చొరబడలేదన్న మోదీ ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే చైనాకు ‘మోదీ సరెండర్’ అయ్యారంటూ ఆరోపించింది. కొవిడ్‌ కట్టడి కోసం ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా నుంచి విరాళాలు అందాయని ఆరోపించింది.

కాంగ్రెస్‌ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన భాజపా.. గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌లకే చైనా నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించింది. ఈ క్రమంలో ఎఫ్‌ఆర్‌సీఏ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. అలాగే యూపీఏ హయాంలో పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వచ్చిన నిధుల్ని ఆర్‌జీఎఫ్‌కు తరలించారని ప్రత్యారోపణలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని