Parliament: పార్లమెంట్‌లో వాయిదాల పర్వం
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 15:41 IST

Parliament: పార్లమెంట్‌లో వాయిదాల పర్వం

విపక్షాల ఆందోళనలతో గందరగోళం

దిల్లీ: పార్లమెంట్‌లో మళ్లీ అదే సీన్‌ రిపీటయ్యింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే, పెగాసస్‌ హ్యాకింగ్‌, రైతుల ఆందోళన, ఇతర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. 

ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళన మొదలుపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు నిరసనను ఉద్ధృతం చేశారు. స్పీకర్‌ వారిని వారించారు. సభ మర్యాదను కాపాడాలని, అన్ని అంశాలపై చర్చిద్దామని అన్నారు. అయినప్పటికీ వారు ఆందోళన ఆపకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ మళ్లీ మొదలవగా.. విపక్షాలు ఆందోళనకు దిగాయి. వీరి నిరసన నడుమే కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో ఆగ్రహానికి గురైన స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 

అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ.. విపక్షాల నినాదాలు కొనసాగాయి. దీంతో కొద్ది క్షణాలకే రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. 

రాహుల్‌ నిరసన..

మరోవైపు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఇందులో పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని