తొలి గగనయానానికి సిద్ధం

తాజా వార్తలు

Published : 07/04/2021 09:29 IST

తొలి గగనయానానికి సిద్ధం

అంగారక వాతావరణాన్ని తట్టుకున్న నాసా హెలికాప్టర్‌

వాషింగ్టన్‌: అంగారకుడి ఉపరితలం మీదకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ‘ఇన్‌జెన్యుటీ’ హెలికాప్టర్‌ సొంతంగా అక్కడి కఠోర వాతావరణాన్ని తట్టుకొని నిలబడింది. సాంద్రత తక్కువగా ఉండే అక్కడి గాలిలో గగనవిహారం చేయడానికి ఈ లోహ విహంగం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని సంస్థ పేర్కొంది. 

పర్సెవరెన్స్‌ రోవర్‌లో అంతర్భాగంగా ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌ను అంగారక గ్రహంపైకి పంపారు. ఆ రోవర్‌ ఫిబ్రవరి 18న అరుణ గ్రహంపైనున్న జెజెరో బిలంలో దిగిన సంగతి తెలిసిందే. శనివారం ఇన్‌జెన్యుటీ రోవర్‌ నుంచి విడిపోయిన హెలికాప్టర్‌.. విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది. అనంతరం రోవర్‌ నుంచి ఎలాంటి తోడ్పాటు లేకుండానే అక్కడి వాతావరణాన్ని తట్టుకుందని నాసా ప్రకటించింది. అక్కడ రాత్రివేళ చలి.. మైనస్‌ 90 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. దీన్ని హెలికాప్టర్‌ విజయవంతంగా ఎదుర్కొందని నాసా తెలిపింది. తీవ్ర శీతల వాతావరణం వల్ల ఇన్‌జెన్యుటీలోని కీలక విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతినకుండా ఒక హీటర్‌ను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. సౌరశక్తితో పనిచేసే బ్యాటరీ ద్వారా దీనికి శక్తి అందుతుంది. హెలికాప్టర్‌లోని ఉపకరణాలన్నీ సవ్యంగానే పనిచేస్తున్నాయని ఇన్‌జెన్యుటీ ప్రాజెక్టు మేనేజర్‌ మిమి ఆంగ్‌ చెప్పారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ నెల 11న అది తొలిసారిగా అంగారకుడి వాతావరణంలో గగనవిహారం చేస్తుంది. భూమికి వెలుపల ఒక గ్రహంపై ఆకాశయానం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు 60వ వార్షికోత్సవం, కొలంబియా స్పేస్‌ షటిల్‌ మొదటి యాత్రకు 40వ వార్షికోత్సవం నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రయత్నానికి ప్రాధాన్యం ఏర్పడింది.  

1.8 కేజీల బరువుండే ఇన్‌జెన్యుటీ.. తొలి ప్రయత్నంలో సెకనుకు మూడు అడుగుల వేగంతో గాల్లోకి లేస్తుంది. మొత్తం 30 సెకన్ల పాటు గగనవిహారం చేస్తుంది. ఈ క్రమంలో ఆకాశం నుంచి అంగారక ఉపరితలాన్ని ఫొటోలు తీస్తుంది. 1903లో రైట్‌ సోదరులు తమ తొలి విమాన రెక్కల్లో ఉపయోగించిన ఒక వస్త్రానికి సంబంధించిన తునకను ఇన్‌జెన్యుటీలో ఉంచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని