Ruckus in Parliament : ఆ దేశ చట్ట సభల్లోనూ.. ఇలాంటి ఘటనలే

తాజా వార్తలు

Updated : 14/08/2021 13:39 IST

Ruckus in Parliament : ఆ దేశ చట్ట సభల్లోనూ.. ఇలాంటి ఘటనలే

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలపై చర్చ జరపాలని పట్టుబట్టి విపక్షాలు నిరసనలకు దిగడంతో ఈసారి పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. సభ్యులు దూకుడుగా వ్యవహరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, కాగితాలు చించి విసరడం, ఫైల్స్ లాగడం వంటి చర్యలతో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ వైఖరి అటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇటు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని బాధించింది. ఈ పరిణామాల పట్ల ఒక దశలో భావోద్వేగానికి గురైన వెంకయ్య సభలో కంటతడి కూడా పెట్టుకున్నారు. పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ తరహా పరిస్థితులు మన ఒక్క దేశానికే పరిమితం కాలేదు. ఇటీవలి కాలంలో పలు దేశాల చట్టసభల్లో సభ్యుల వైఖరి నోరెళ్లబెట్టేలా చేసింది. 

పాకిస్థాన్‌లో బడ్జెట్ పెట్టిన వేళ..

బడ్జెట్ ప్రతి దేశానికి ఒక కీలకాంశం. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో దానిపై జరుగుతోన్న చర్చ కాస్త.. వీధి గొడవలా మారిపోయింది. ఫైల్స్, పుస్తకాలు అన్నీ గాల్లోకి లేచాయి. పోటాపోటీగా సభ్యులు ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకున్నారు. అందులో కొందరు పెద్దలు ఆగమని చెబుతున్నప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా బల్లలపైకి ఎక్కి మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.

బొలీవియా ..బాక్సర్లను తలదన్నేలా.. 

పర్వత ప్రాంతాలు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన బొలీవియాలో కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు జుగుప్స కలిగించింది. 2006 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఈవో మొరాలెస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రయత్నించారంటూ ఒక సీనియర్ పార్లమెంటేరియన్‌పై ఆరోపణలు వచ్చాయి. అలాగే మొరాలెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అవినీతికి పాల్పడిందంటూ దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రెండు విషయాలు అక్కడి చట్ట సభను కుదిపేశాయి. పలువురు సభ్యులు తమ స్థాయి, స్థానాన్ని మర్చిపోయి దాడి చేసుకున్న తీరు నివ్వెరపర్చింది. 

పాన్‌ ఆఫ్రికా పార్లమెంట్‌లో చంపేస్తానంటూ బెదిరింపులు..

235 మంది సభ్యులు గల పార్లమెంట్‌కు ఎవరు అధ్యక్షుడిగా నియమితులు కావాలో నిర్ణయించుకునేందుకు పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ దక్షిణాఫ్రికాలోని జొహెనస్‌బర్గ్‌లో సమావేశమైంది. తమ దేశానికి ఆ గౌరవం దక్కాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేసింది. అందుకు మిగతా సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఎంపీ ఒకరు ‘నిన్ను చంపుతా’ అంటూ ప్రత్యర్థి ఎంపీ వైపు వేలు చూపించి బెదిరించడం కెమెరా కంటికి చిక్కింది. అది కాస్తా  నెట్టింట్లో షేర్‌ అయి వైరల్‌గా మారింది. 

చెక్‌ రిపబ్లిక్‌ .. ఛైర్మన్‌ను పట్టించుకోకుండా..

చెక్‌ రిపబ్లిక్ పార్లమెంట్ దిగువ సభలో కొవిడ్‌పై చర్చ రసాభాసగా మారింది. ఛైర్మన్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఒకరు మాట్లాడాలని ప్రయత్నించడం, మిగతా వారు అడ్డుకోవడం ఆ సభలో కార్యకలాపాలను రసాభాసగా మార్చాయి. ఇక తైవాన్ పార్లమెంట్‌లో జరిగింది అక్కడి ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. అమెరికా నుంచి మాంసం దిగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తైవాన్ ప్రీమియర్ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసనగా పంది మాంసాన్ని విసిరి సభను అగౌరవపర్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని