అయ్యో.. ట్రంప్‌ అలా అనలేదు.. !

తాజా వార్తలు

Updated : 16/03/2021 12:58 IST

అయ్యో.. ట్రంప్‌ అలా అనలేదు.. !

 సవరణ ప్రచురించిన వాషింగ్టన్‌ పోస్టు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒక వ్యక్తి ‘నోరుపారేసుకుంటాడు..’ అనే పేరు తెచ్చుకొంటే.. ఇక అతడిని భ్రష్టుపట్టించడమంత తేలికైన పని ప్రత్యర్థులకు మరొకటి ఉండదు. అన్నవి.. అననివీ కలిపి ప్రచారం చేసి వీలైనంతగా అతనికి చెడ్డపేరు తీసుకురావచ్చు. ట్రంప్‌ విషయంలో ఇదే జరిగింది. ట్రంప్‌ ఓటమి జనవరి మొదటి వారం నాటికే దాదాపు ఖాయమైపోయింది. ఆ సమయంలో ట్రంప్‌ తన పరువు దక్కించుకునేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. జార్జియాలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాని ట్రంప్‌ బలంగా విశ్వసించారు. ఈ మేరకు ఆయన జార్జియాలోని ఎన్నికల అధికారిణి వాట్సన్‌కు ఫోన్‌ చేశారు. దీనిపై అప్పట్లో వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సంచలన కథనం రాసింది. ట్రంప్‌ తన ఫోన్‌కాల్‌లో ఆ ఎన్నికల పరిశీలకురాలిని ‘మోసాన్ని పట్టుకో’, అది చేస్తే నువ్వో జాతీయ హీరోవు అవుతావు’ అంటూ ఒత్తిడి చేసి ప్రలోభపెట్టినట్లు పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ కథనం ప్రచురించినట్లు పేర్కొంది. అప్పట్లో ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌ వ్యతిరేకత ఎదుర్కొని దాదాపు ఏకాకి అయ్యారు. ఈ కథనాన్ని వాషింగ్టన్‌ పోస్టు ప్రచురించిందంటూ సీఎన్‌ఎన్‌, ఏబీసీన్యూస్‌, ఎన్‌బీసీన్యూస్‌, యుఎస్‌టుడే సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్రికలు వాడుకొన్నాయి. అంతేకాదు ట్రంప్‌ అభిశంసనలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తేలింది.

ట్రంప్‌ జార్జియా ఎన్నికల పరిశీలకురాలితో మాట్లాడినట్లు చెబుతున్న ఫోన్‌కాల్‌ రికార్డును తాజాగా ఆ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ కార్యాలయం విడుదల చేసింది. దీంతో వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన కథనంలోని అంశాలు తప్పని తేలాయి. దీనిపై ఆ పత్రిక సవరణ ప్రచురించింది. ‘మోసాన్ని పట్టుకో’, అది చేస్తే నువ్వో జాతీయ హీరోవు అవుతావు’  అనే మాటలు ట్రంప్‌ అనలేదని పేర్కొంది. ట్రంప్‌ ఎన్నికల పరిశీలకురాలికి ఫోన్‌ చేసి.. ‘‘ఫౌల్‌టౌన్‌ కౌంటీలో బ్యాలెట్‌ పత్రాలను పరిశీలించండి’’ అని అభ్యర్థించారు. ‘‘అక్కడ మోసాన్ని గుర్తిస్తారు’’ అని చెప్పారు.  అంతేకాదు.. ‘‘మీరు ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన విధులు నిర్వహిస్తున్నారు’’ అని గుర్తుచేశారని తాజా సవరణలో వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది.  గత వారం వాల్‌స్ట్రీట్‌ పత్రిక ఈ ఫోన్‌కాల్‌ను ప్రచురించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నేను ముందు నుంచి చెబుతున్నా..:  ట్రంప్‌

వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సవరణ ప్రచురించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘‘ఈ సవరణ ప్రచురించినందుకు అభినందిస్తున్నా. అసలు ఆ కథనమే ఓ అభూత కల్పన అని మొదటి నుంచి చెబుతున్నా. నేను ఇప్పటికీ చెబుతున్నా ఫౌల్‌టన్‌ కౌంటీలో ఓటింగ్‌ను పరిశీలిస్తే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వేరేలా ఉంటాయి. పాతుకుపోయిన మీడియాలో నాపైనా.. మా రిపబ్లికన్‌ పార్టీ పైనా వస్తున్న అవాస్తవ ప్రచారాలను మీరు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ట్రంప్‌ వాషింగ్టన్‌ పోస్టు పత్రికను తీవ్రంగా విమర్శించారు. ఆ పత్రిక యజమాని జెఫ్‌బెజోస్‌తో కూడా ట్రంప్‌కు సఖ్యత లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని