నా మాటలు ముమ్మాటికీ సరైనవే

తాజా వార్తలు

Published : 13/01/2021 12:53 IST

నా మాటలు ముమ్మాటికీ సరైనవే

ప్రసంగాన్ని సమర్థించుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: కొద్దిరోజులుగా శ్వేతసౌధంలోనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. టెక్సాస్‌ పర్యటనకు బయల్దేరిన ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌పై తన మద్దతుదారులు దాడి చేయడానికి ముందు తాను చేసిన ప్రసంగాన్ని ట్రంప్‌ సమర్థించుకున్నారు. ‘‘ఎన్నికల్లో నిజమైన విజేతను నేనే. బైడెన్‌ కాదు’’ అన్న వ్యాఖ్యలు ముమ్మాటికీ సరైనవేనన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్‌ నేతలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం పూర్తిగా అసంబద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది అత్యంత భయంకరమైన చర్య. దేశంలో ఆగ్రహావేశాలకు ఇది దారితీస్తుంది. అయినా మేము హింసను కోరుకోవడంలేదు. అమెరికా రాజకీయ చరిత్రలో క్షుద్ర వేటగా ఈ ప్రక్రియ మిగిలిపోతుంది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. టెక్సాస్‌లో స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశముంది. అక్రమ వలసలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని, అమెరికా-మెక్సికో సరిహద్దు గోడను విజయవంతంగా నిర్మించిందని ఆయన వివరించనున్నారు.

దాడి చేసింది నా మద్దతుదారులు కాదు..
ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ అగ్రనేత కెవిన్‌ మెకార్టీతో ట్రంప్‌ మంగళవారం ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ‘‘కాంగ్రెస్‌ భవనంపై దాడికి పాల్పడింది నా మద్దతుదారులు కాదు. వామపక్ష యాంటిఫా కార్యకర్తలే ఆ పని చేశారు’ అని ట్రంప్‌ పేర్కొనగా... ‘యాంటిఫా వాళ్లు కాదు. ఎవరు దాడి చేశారో నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నా’ అని మెకార్టీ చెప్పారు. ట్రంప్‌ తన మాటలను కొనసాగిస్తూ నిజమైన విజేతను నేనేనని చెప్పుకొచ్చారు.  

ట్రంప్‌ గౌరవ డిగ్రీల రద్దు!
బెత్లెహెమ్‌:  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... మరో అవమానానికి గురయ్యారు! పెన్సిల్వేనియాలోని బెత్లెహెమ్‌లో ఉన్న లేహై యూనివర్సిటీ. గతంలో ఆయనకు ప్రదానం చేసిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది. క్యాపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడిన మరుసటి రోజే వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌కు చెందిన వాగ్నెర్‌ కాలేజ్‌ బోర్డు సైతం 2004లో ట్రంప్‌నకు ఇచ్చిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది.

70 వేల ట్విటర్‌ ఖాతాల బంద్‌
క్యాపిటల్‌ హిల్‌పై దాడి నేపథ్యంలో 70 వేల ఖాతాలను స్తంభింపజేసినట్టు ట్విటర్‌ వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా కొందరు కుట్రపూరిత, హానికర సమాచారాన్ని చేరవేస్తున్నారని పేర్కొంది. మరోవైపు- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి ‘స్టాప్‌ ద స్టీల్‌’ కంటెంట్‌ను తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాలంటూ ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి పేర్కొన్న ఈ నినాదం హింసకు దారితీస్తోందని ఫేస్‌బుక్‌ ఇంటిగ్రిటీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ గై రోజెన్‌ తెలిపారు.

క్యాపిటల్‌ హింసాకాండలో బాంబులు!
రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ కార్యాలయాల వద్ద  అమర్చిన ఆందోళనకారులు

వాషింగ్టన్‌: అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా... ఆందోళనకారులు బాంబులను సైతం ఉపయోగించినట్లు తెలుస్తోంది! గత బుధవారం హింసాకాండ కొనసాగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది వీటిని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైనట్లు మంగళవారం వెల్లడైంది. వాషింగ్టన్‌లోని రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీల కార్యాలయాలకు అత్యంత సమీపంలో క్యాపిటల్‌ పోలీసు, ఎఫ్‌బీఐ బృందాలు రెండు పైపు బాంబులను గుర్తించాయి. వీటిలో గుర్తుతెలియని పొడి, లోహాలు ఉన్నాయని... టైమర్లను కూడా ఈ బాంబులకు అమర్చారని అధికారులు వెల్లడించారు. దాడి సందర్భంగా క్యాపిటల్‌ భవనం వద్ద నిలిచిన ఓ ట్రక్కులో ఎం4 కార్బైన్‌ రైఫిల్, 11 సీసా బాంబులను పోలీసులు గుర్తించారు. అనంతరం ట్రక్కు డ్రైవరును అరెస్టు చేశారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌ను తొలగించబోను: పెన్స్‌

ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని