బ్రిటన్‌లో ఘనంగా గాంధీ జయంతి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్రిటన్‌లో ఘనంగా గాంధీ జయంతి

మహాత్ముని వేషధారణలో ఆకట్టుకున్న వెలగపూడి బాపూజీ రావు

కార్డిఫ్‌ (బ్రిటన్‌): భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని బ్రిటన్‌లోని వేల్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి కార్డిఫ్‌ పట్టణంలో ఉన్న ఇండియా సెంటర్‌కు చెందిన హిందూ కల్చరల్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంగ్లండులోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘సెయింట్‌ ఫాగన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్ హిస్టరీ’ వద్ద జరిగిన ఈ  కార్యక్రమంలో.. రెండువేలకు పైగా భారతీయులు, ఆంగ్లేయులు కూడా పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.

వేల్స్‌ ప్రభుత్వంలో ఫస్ట్‌ మినిస్టర్‌ అయిన మార్క్‌ డ్రేక్‌ఫోర్డ్‌, ఆరోగ్య మంత్రి వాఘన్‌ గెథిన్‌, ఇతర పార్లమెంటు సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరాన్ని అహింసా పథంలో నడపటంలో గాంధీజీ పాత్ర, ఆయన సందేశాలు ఆధునిక ప్రపంచానికి ఏ విధంగా ఆచరణీయమో తదితర అంశాలను వారు ఆహూతులకు వివరించారు. అంతేకాకుండా వేల్స్‌‌, భారత్‌కు మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢమైనవని వారు ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా.. మహాత్మా గాంధీ జీవిత ఘట్టాలకు సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్‌ వెలగపూడి బాపూజీ రావు మహాత్ముని వేషధారణలో శాంతి దూతగా కనిపించి అందరి గౌరవాన్ని చూరగొన్నారు. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని సాలపాడు గ్రామానికి చెందిన డాక్టర్‌ రావు.. గుంటూరు మెడికల్‌ కళాశాల, ఎయిమ్స్‌ దిల్లీలలో వైద్యవిద్య అభ్యసించారు. అనంతరం ఆయన 1973లో బ్రిటన్‌కు తరలి వచ్చి ప్రస్తుతం వేల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.


మరిన్ని