అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సు
అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సు

అమరావతి: రాష్ట్ర విద్యార్థులకు విదేశీ విద్యలో ఉత్తమ మార్గదర్శకంగా ఉండే ఓ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఓ ఆన్‌లైన్‌ సదస్సును నిర్వహించనుంది. దీనిలో అగ్రరాజ్యంలోని వంద అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు పాల్గొననున్నట్లు అధికారులు వివరించారు. ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ ప్రతి యేటా నిర్వహించే ఈ ‘యూఎస్‌ యూనివర్సిటీ ఫెయిర్‌’ ఈసారి ఆన్‌లైన్‌ వేదికగా జరుగనుంది.

పీజీ, పీహెచ్‌డీలకు సంబంధించి అక్టోబర్‌ 2,3 తేదీల్లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు (bit.ly/EdUSAFair20-Bmail)... డిగ్రీ, అసోసియేట్‌  కార్యక్రమాలకు సంబంధించి అక్టోబర్‌ 9,10 తేదీల్లో  bit.ly/UGEdUSAFair20-BMail) ఆన్‌లైన్‌ సదస్సులను నిర్వహించనున్నారు. దీని ద్వారా అమెరికాలో విద్యనభ్యసించేందుకు ఉన్న అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, విద్యాసంస్థల గుర్తింపు తదితర పలు కీలక అంశాల గురించిన సమాచారాన్ని సంబంధిత విశ్వవిద్యాలయాల అధికారుల నుంచి నేరుగా పొందవచ్చు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా లింక్‌ల ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు వివరించారు.

కాగా, ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌, అగ్రరాజ్యం లోని వివిధ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అమెరికాలో డిగ్రీ, పీజీ (మాస్టర్స్‌), పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విదేశీ విద్య సంచాలకులు డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement


మరిన్ని