కరోనాపై బైడెన్ తొలి అస్త్రం ఇదే
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనాపై బైడెన్ తొలి అస్త్రం ఇదే

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమల్లోకి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌ కరోనా కట్టడి. ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం ఆయన చేపట్టనున్న చర్యల్ని గురువారం వెల్లడించారు. తొలుత అమెరికా ప్రజలందరినీ 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించమని కోరతానన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రంప్‌ విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కావడం గమనార్హం. మాస్క్‌ ధరించడం అత్యవసరం కాదన్న ట్రంప్‌ నిర్ణయమే అమెరికా వ్యాప్తంగా వైరస్‌ వేగంగా వ్యాపించేందుకు కారణమైందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. 

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ బైడెన్‌ మాస్క్‌ ధరించడానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. మాస్క్‌ ధరించడం దేశ భక్తుల విధి అని ప్రచారం చేశారు. ‘‘అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20నే 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించమని దేశ ప్రజల్ని కోరతాను. ఎప్పటికీ ధరించమని చెప్పను. కేవలం 100 రోజులే. నాకు తెలిసి కొత్త కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గిపోతాయి’’ అని బైడెన్‌ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ అన్నారు.

ఫౌచీ.. మా బృందంలో ఉండిపోండి

ప్రస్తుతం అమెరికాలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా ఉన్న డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీని తన బృందంలోనూ ‘చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌’గా ఉండమని కోరతానని బైడెన్‌ తెలిపారు. అలాగే శ్వేతసౌధంలో కరోనా కట్టడి కోసం పనిచేసే ప్రత్యేక కార్యదళంలోనూ ఉండాలని విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు 1,41,24,678 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,76,148 మంది ప్రాణాలు కోల్పోయారు.


మరిన్ని