బైడెన్‌ వీసా విధానంతో భారతీయులకు లబ్ధి!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ వీసా విధానంతో భారతీయులకు లబ్ధి!

వాషింగ్టన్‌: వలసదారుల విషయంలో తాజాగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాస్త ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు 1.1 కోట్ల మంది అనధికార వలసదార్లకు అమెరికా పౌరసత్వం కల్పించే విషయంపై తన కార్యాచరణకు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు లబ్ధి పొందుతారు. అలాగే ఏటా 95 వేల మంది శరణార్థుల్ని అనుమతించే అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బైడెన్‌ ప్రచార బృందం విదేశాంగ విధానంపై ఓ విధాన పత్రాన్ని విడుదల చేసింది. 

కుటుంబ ఆధారిత వలస విధానానికి బైడెన్‌ మద్దతు ఉంటుందని ఆయన విధానం పత్రం పేర్కొంది. కుటుంబ ఐక్యతకు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ఉన్న ప్రాధాన్యాన్ని పరిరక్షిస్తామని తెలిపింది. కుటుంబ వీసా బ్యాక్‌లాగ్‌లను సైతం తగ్గించేందుకు కృషి చేస్తామని వివరించింది. అధికార బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ మేరకు చట్టసభలతో చర్చిస్తారని పేర్కొంది. 

ఒబామా సర్కార్‌ మానవతా థృక్పథంతో తెచ్చిన ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ ప్రోగ్రాం’(డీసీసీఏ)ను ట్రంప్‌ నిర్దాక్షిణ్యంగా బలహీనపరిచిన విషయం తెలిసిందే. దీన్ని తిరిగి పునరుద్ధరిస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో వచ్చి.. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన పథకమే డీఏసీఏ. 

గ్రీన్‌ కార్డుల జారీ, ఇతర వలస, వలసేతర వీసాలపై ట్రంప్‌ విధించిన ఆంక్షల్ని సైతం బైడెన్‌ సడలిస్తారని విధానపత్రం పేర్కొంది. అలాగే నేచురలైజేషన్‌ ప్రక్రియ ద్వారా గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఇచ్చే పౌరసత్వాన్ని సైతం ఏటా ఎక్కువ మందికి ప్రదానం చేస్తారని తెలిపింది. శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌ కార్డు జారీల్ని సైతం పెంచుతారని వెల్లడించింది. వివిధ రంగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన నిపుణులకు నేరుగా పౌరసత్వం కల్పించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అలాగే హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వసతినీ పునరుద్ధరించే అవకాశం ఉంది. 

నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే హెచ్‌-1బీ వంటి వలసేతర వీసాలపై ట్రంప్‌ విధించిన ఆంక్షల్ని, పరిమితుల్ని బైడెన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అలాగే వీసాల జారీ విషయంలో దేశాల వారీగా ఉన్న పరిమితిని సైతం తొలగిస్తారని ఆయన విధాన పత్రం పేర్కొంది. పలు ఇస్లాం దేశాల ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని సైతం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి...

ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్‌!

ఓటమికి ముందు ట్రంప్‌ ఏం చేశారంటే..!


మరిన్ని