విదేశాంగమంత్రిగా బ్లింకెన్‌.. జాన్‌కెర్రీకి పర్యావరణం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విదేశాంగమంత్రిగా బ్లింకెన్‌.. జాన్‌కెర్రీకి పర్యావరణం

కేబినెట్‌లో భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించిన బైడెన్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది. కేబినెట్‌లో కొందరి పేర్లను బైడెన్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు. కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించారు. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్‌ సలహాదారుడు జేక్‌ సులివాన్‌ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేన్స్‌ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్‌ గ్రెన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా-బైడెన్‌ ప్రభుత్వంలో పనిచేసిన వారే.  

పర్యావరణ రాయబారిగా జాన్‌కెర్రీ

విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి జాన్‌ కెర్రీని కేబినెట్‌లోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ప్రత్యేకంగా పర్యావరణ రాయబారిగా నియమించారు. 2013-17 మధ్య కెర్రీ అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 2015లో జరిగిన పారిస్‌ పర్యావరణ ఒప్పందంపై అమెరికా తరఫున సంతకం చేసింది ఈయనే. అయితే ఆ తర్వాతి కాలంలో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌కు భిన్నంగా కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ తాను పర్యావరణానికి ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగానే అమెరికా జాతీయ భద్రతా మండలిలో తొలిసారిగా పర్యావరణ రాయబారి పదవి తీసుకొచ్చారు. ఈ బాధ్యతలను జాన్‌ కెర్రీకి అప్పగిస్తూ బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. 

‘అమెరికా అధినాయకత్వాన్ని పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది. ఈ బృందం ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తుందని విశ్వసిస్తున్నా’ అని బైడెన్‌ ట్విటర్‌ వేదికగా చెబుతూ కేబినెట్‌ మంత్రులను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను షేర్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోలేదంటూ  మంకుపట్టు పట్టిన ట్రంప్‌ ఎట్టకేలకు దిగొచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. అయితే ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. 

ఇదీ చదవండి..

దిగొచ్చిన ట్రంప్‌ మరిన్ని