బైడెన్ వల్ల భారత్‌కు మంచి జరగదు:జూనియర్‌ ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్ వల్ల భారత్‌కు మంచి జరగదు:జూనియర్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ చైనా పట్ల మెతక వైఖరి అవలంబించే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ అభిప్రాయపడ్డారు. డ్రాగన్‌ పట్ల ఉదారంగా వ్యవహరించే వారితో భారత్‌కు ఏ మాత్రం మంచి జరగబోదని వ్యాఖ్యానించారు. ‘‘చైనా వల్ల ఎంత ముప్పో బహుశా భారతీయ అమెరికన్లుగా తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అధ్యక్ష రేసులో మన ప్రత్యర్థులుగా ఉన్న బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు చైనీయులు 1.5 బిలియన్‌ డాలర్లు ఇచ్చారు. బైడెన్‌ అమ్ముడుపోయే వ్యక్తి అని తెలిసే వారలా చేశారు. కాబట్టి, ఆయన చైనా పట్ల మెతకగానే ఉంటారు. అంటే అది భారత్‌కు ఏమాత్రం మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు. బైడెన్‌, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ జూనియర్‌ ట్రంప్‌ రాసిన ‘లిబరల్‌ ప్రివిలేజ్‌’ పుస్తక విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

చైనాతో పాటు ఉక్రెయిన్‌, రష్యాతోనూ బైడెన్ ఉదాసీనంగా ఉండే అవకాశం ఉందని జూనియర్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు తన మనసుకు చాలా దగ్గరి వారని.. వారి గురించి తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. చాలా కష్టపడే మనస్తత్వం గల వారని, కుటుంబ సంస్కృతిని ఆస్వాదిస్తారని, విద్యపై మక్కువ కలవారని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లలో డెమొక్రాట్ల దేని కోసం పోరాడుతున్నారు, దేనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారో భారతీయ అమెరికన్లు చూస్తూనే ఉన్నారన్నారు.

ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని జూనియర్‌ ట్రంప్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ట్రంప్‌ సభలకు వచ్చినంతగా ప్రజలు మరే కార్యక్రమానికి హాజరుకారని తెలిపారు. కానీ, భారత్‌లో ప్రధాని మోదీతో కలిసి జరిపిన కార్యక్రమమే ట్రంప్‌ సభల్లో ఇప్పటి వరకు అతి పెద్దది అని పేర్కొన్నారు.


మరిన్ని