చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న బైడెన్?
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న బైడెన్?

అధికార బదిలీలో జాప్యం చేస్తున్న జీఎస్‌ఏపై అసంతృప్తి

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా.. అధికార మార్పిడిపై ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించేందుకు ఇంకా నిరాకరిస్తుండడంతో ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. మరోవైపు అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే ‘జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’(జీఎస్‌ఏ) విభాగం బైడెన్‌ గెలుపును ఇంకా అధికారికంగా గుర్తించలేదు. దీంతో బైడెన్‌ బృందం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.   

ఎన్నికల్లో విజేతపై స్పష్టత రాగానే జీఎస్‌ఏ వారి గెలుపును అధికారికంగా గుర్తిస్తుంది. దాంతో అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పటి వరకు జీఎస్‌ఏ నుంచి అధికార బదిలీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అభ్యర్థి విజయాన్ని ఎప్పుడు గుర్తించాలి.. ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై అమెరికా రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టత లేదు. అయితే, విజేత ఎవరన్నదానిపై స్పష్టత వచ్చిన వెంటనే జీఎస్‌ఏ తన తదుపరి ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. 

ఫలితాలు వెలువడి కొత్త అధ్యక్షుడిపై స్పష్టత రాగానే.. ఫెడరల్‌ భవనాల బాధ్యతలు చూసే జీఎస్‌ఏ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ నిధులు, ప్రభుత్వ భవనాలు, అధికారులు, పరికరాల వినియోగానికి బైడెన్‌ బృందానికి అనుమతి ఇవ్వాలి. బైడెన్‌ విజయం ఖాయమై వారం గడిచినా అధికార మార్పిడికి సంబంధించి ఆమె ఎటువంటి లేఖ రాయలేదు. ట్రంప్‌ ఓటమిని ఇప్పటికీ అధికారికంగా అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బైడెన్‌ బృందం చట్టపరమైన చర్యలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. 

జీఎస్‌ఏ బైడెన్‌ గెలుపును గుర్తించనంత కాలం ఆయన అధికార బదిలీ బృందంలోని సభ్యులకు వేతనాలు చెల్లించడం, ప్రయాణాల ఖర్చు, కీలక సమాచారం తెలుసుకోవడం వంటి వాటికి అనుమతి లభించదు. పైగా వివిధ దేశాలకు చెందిన నేతలతో మాట్లాడేందుకు విదేశాంగశాఖలోకి సైతం బైడెన్ బృందాన్ని అనుమతించరు.


మరిన్ని