బైడెన్‌తో మరింత ముందుకు భారత్‌!
బైడెన్‌తో మరింత ముందుకు భారత్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ, అధికార మార్పిడి అంత సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. కీలకమైన పెన్సిల్వేనియా, జార్జియా తదితర 7 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అంశంపై అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరోవైపు దేశాధ్యక్షుడు ప్రమాణస్వీకారానికి 70 రోజులు మాత్రమే సమయముంది. ఈ లోపల రాజ్యంగపరమైన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బరాక్‌ ఒబామా హయాంలో కీలక సేవలు అందించిన సీనియర్‌ అధికారి అలైసా అరెస్‌ ప్రకారం..  కొత్త నాయకత్వంలోనూ భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని తెలుస్తోంది. రక్షణ రంగంలో అమెరికా మద్దతు పెరిగే అవకాశముంది.

‘‘ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రాధామ్యాలు, ఆయన విడుదల చేసిన విధానపత్రం, ప్రసంగాలను పరిశీలిస్తే.. ఇండియాతో సంబంధాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి’’ అని అలైసా అరెస్‌ అన్నారు.  నిజానికి ట్రంప్‌ హయాంలోనే భారత్‌-అమెరికా రక్షణ సంబంధాలు బలోపేతమయ్యాయి. అయితే, ఈ ఒరవడిని బైడెన్‌-హారిస్‌ ప్రభుత్వం కూడా కొనసాస్తోందని ఆయన అన్నారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్- అమెరికా సంబంధాలకు పెద్దపీట వేయడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా ప్రపంచాభివృద్ధికి, శాంతిస్థాపనకు అమెరికా, భారత్‌ రెండూ సన్నిహిత దేశాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బైడెన్‌ గత 15 ఏళ్ల కిందటే చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

గతంలో ఒబామా హయాంలో పౌర అణు ఒప్పందంపై భారత్‌ సంతకాలు చేయడంలో బైడెన్‌ కీలకంగా వ్యవహరించినట్లు అరెస్‌ చెప్పారు.. ఇండోపసిఫిక్‌‌  రీజియన్‌లోని సమస్యలపై భారత్‌తో కలిసి ముందుకు పోతామని బైడెన్‌ తన ప్రచార వెబ్‌సైట్‌లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి నివారణ, వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్‌తో కలిసి ముందుకెళ్తామని పలు సందర్భాల్లో బైడెన్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీనిని బట్టి ఆయన హయాంలో భారత్‌తో సంబంధాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

Advertisement

Advertisement


మరిన్ని