కరోనా చీకటిని కలిసికట్టుగా తరిమేద్దాం!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనా చీకటిని కలిసికట్టుగా తరిమేద్దాం!

దీపావళి సందర్భంగా బోరిస్‌ జాన్సన్‌, ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రత్యేక సందేశం

లండన్‌: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండుగ.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అధిగమించడాన్ని ప్రతిబింబిస్తోందని గుర్తుచేశారు. కరోనా అనే చీకటితో నిండిన ఈ కాలాన్ని వెలుతురుతో పారదోలాలనే అంతర్లీన ఇతివృత్తాన్ని చాటుతోందన్నారు. 

‘‘ఈ దీపావళి మనందరికీ శక్తిమంతమైన సందేశాన్నిస్తోంది. రాముడు రాక్షసుడైన రావణుడిని ఓడించినట్లు.. చీకటిపై వెలుతురు విజయం సాధించినట్లు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం గెలిచినట్లే మనం కొవిడ్‌పై విజయం సాధిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని బోరిస్‌ జాన్సన్ అన్నారు. ఈ అద్భుతమైన పండుగ చాటే సందేశం నుంచి ప్రతిఒక్కరం స్ఫూర్తిపొందుదాం. ప్రపంచవ్యాప్తంగా చీకటిని చీలుస్తూ వెలిగే దీపావళి కాంతులు ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రతీకగా నిలవనున్నాయి.’’ - బోరిస్‌ జాన్సన్‌, యూకే ప్రధాని

మరోవైపు ప్రిన్స్‌ చార్లెస్‌ సైతం దీపావళి విశిష్టతకు కరోనాపై పోరుకు ముడిపెడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ఆనందంగా గడపాల్సిన ఈ సమయాన్ని ఆంక్షల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఇది నిరాశకు గురిచేసే అంశమైనప్పటికీ.. పండుగ అందించే సందేశంతో స్ఫూర్తి పొందాలన్నారు. దీపావళి సందేశానికి ప్రతీకగా.. మహమ్మారి సంక్షోభ సమయంలో సమాజ సేవకు ముందుకు వచ్చిన బ్రిటిష్ హిందూ, సిక్కు, జైన వర్గాలను ఆయన ప్రశంసించారు. ఈ దీపావళిని ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. కొవ్వొత్తి వెలిగించి, ‘శుభ్ దీపావళి’ అనే పదాలతో ప్రిన్స్‌ చార్లెస్‌ తన దీపావళి సందేశాన్ని ముగించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ సైతం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.



మరిన్ని