గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి: సీడీసీ వెనకడుగు!
గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి: సీడీసీ వెనకడుగు!

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఎలా వ్యాపిస్తుందన్న విషయంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని నిర్ధారించే కచ్చితమైన పరిశోధనలు ఇప్పటికీ లేవనే చెప్పవచ్చు. తాజాగా అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలణ కేంద్రం(సీడీసీ)కూడా దీనిపై వెనక్కి తగ్గింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఈ మధ్యే చేసిన ప్రకటనను తాజాగా విరమించుకుంది. అయితే, తొందరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని పేర్కొంది.

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా? లేదా? అనే విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే వైరస్‌ గాలిద్వారా వ్యాపిస్తుందని అమెరికా సీడీసీ ఈ మధ్యే తన మార్గదర్శకాల్లో పొందుపరచింది. అంతేకాకుండా గాలిలో వైరస్‌ కణాలు ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వ్యాపించగలవని ప్రకటించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎయిర్‌ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే, దానిని సీడీసీ వెబ్‌సైట్‌లో పెట్టిన రెండు రోజులకే ఆ సూచనను తొలగించింది. గాలిలో వైరస్‌ వ్యాప్తిపై చేసిన ముసాయిదా రిపోర్టు తప్పుగా పోస్టు అయినట్లు పేర్కొంది. పూర్తి విశ్లేషణ అనంతరం దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తామని సీడీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం, వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు నోటి తుంపరుల ద్వారా వ్యాపిస్తుందని మాత్రం స్పష్టంగా పేర్కొంది. లక్షణాలు లేనివారి నుంచి కూడా వైరస్‌ సోకే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఇక, గాలిలో వైరస్‌ వ్యాప్తిపై సీడీసీ తమ మార్గదర్శకాలను మార్చడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇదిలాఉంటే, వెంటిలేషన్‌ సరిగాలేని రద్దీ ప్రదేశాల్లో గాలిలో వైరస్‌ వ్యాపించే అవకాశాలున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది.

Advertisement

Advertisement


మరిన్ని