అమెరికా అతలాకుతలం 
అమెరికా అతలాకుతలం 

ఉద్ధృతమవుతున్న కరోనా కేసులు

నిండిపోయిన ఆస్పత్రులు
నైరాశ్యంలో వైద్యసిబ్బంది

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న కేసులు, నిండుతున్న ఆస్పత్రులు, దొరకని పడకలు.. అక్కడి వైద్య సిబ్బందిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికి 3 లక్షల మందికి పైగా మృతి చెందారు. అయినా వైరస్‌ జోరు తగ్గుతున్న సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా  ఆస్పత్రులు, వైద్యవర్గాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కరోనా రాకముందు ఐసీయూలో ఓ నర్సు ఇద్దరు రోగులను పర్యవేక్షిస్తే.. ఇప్పుడు నలుగురైదుగురిని చూడాల్సిన పరిస్థితి. దీంతో పని భారం సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ప్రాధమిక వసతుల కొరత కూడా వారిని వేధిస్తోంది. మాస్కులు లభించడం లేదు. అత్యవసర పరికరాలూ లభ్యం కావడం లేదు. దీనికి తోడు కేసులు పెరగడంతో వైద్య సిబ్బందిలో నైరాశ్యం నెలకొందని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతమని హెచ్చరిస్తున్నారు.  

 భయపెట్టిస్తున్న పండుగలు

మరోవైపు అమెరికాను పండుగలు భయపెట్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’ కరోనా వ్యాప్తిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సంబరం తర్వాత అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరగడం ప్రారంభించింది. అమెరికన్లు ఏటా నవంబర్‌ నాలుగో వారంలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే జరుపుకుంటారు. కరోనా నేపథ్యంలో ఈ సంబరాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగింది. ‘థ్యాంక్స్‌గివింగ్‌ డే’ తర్వాత దాదాపు 16 శాతం కేసులు పెరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సమయంలో ఏం జరగనుందోనని అధికారులు భయపడుతున్నారు.

మళ్లీ ఆంక్షలు

ఒక్కసారిగా పెరుగుతున్న కేసుల కారణంగా ఆస్పత్రులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. గురువారం న్యూయార్క్‌ నగరంలో ఇండోర్‌ డైనింగ్‌పై ఆ సిటీ గవర్నర్‌ అండ్రూ క్యూమో నిషేధం విధించారు. పెన్సిల్వేనియా గవర్నర్‌ టామ్‌ వూల్ఫ్‌ కూడా దాదాపు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పాఠశాలల్లో క్రీడలను నిషేధించారు. జిమ్‌లను, జూదశాలలను మూసివేశారు. 


మరిన్ని