చైనాలో ట్రంప్‌ వ్యాపార లావాదేవీలు 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చైనాలో ట్రంప్‌ వ్యాపార లావాదేవీలు 

అక్కడ పన్నులు కూడా కట్టారు
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

వాషింగ్టన్‌: చైనాతో జో బైడెన్‌ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించడంతో పాటు, అమెరికాను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందంటూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకునపెట్టే అంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ బయటపెట్టింది. స్వయంగా ట్రంపే చైనాలో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన తొలిసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన సమయానికి చైనాలో కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తున్నారని వెల్లడించింది. చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఓ సంస్థతో కలసి ఆయన ప్రాజెక్టులు చేపట్టారని తెలిపింది. చైనాతో పాటు బ్రిటన్, ఐర్లాండ్‌ల్లో ట్రంప్‌ సంస్థ పేరిట బ్యాంకు ఖాతాలున్నాయని పేర్కొంది. ట్రంప్‌ చెల్లించిన పన్నుల పత్రాల ఆధారంగా ఈ విషయాలు బయటపడినట్లు వెల్లడించింది. చైనాలో ఉన్న ఖాతా ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఉందని, దాని ద్వారా 2013-15 మధ్య లైసెన్సింగ్‌ ఒప్పందాల ద్వారా 188,561 డాలర్లు పన్నులుగా చెల్లించారని పేర్కొంది. వాస్తవానికి చైనాలో ట్రంప్‌ వ్యాపార యత్నాలు 2006లోనే మొదలయ్యాయని, ఆ సమయంలోనే తన కంపెనీలకు ట్రేడ్‌మార్క్‌ గుర్తింపు కోసం చైనా, హాంకాంగ్‌లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.  2012లో షాంఘై కార్యాలయాన్ని ప్రారంభించారని, చైనాతో భాగస్వామ్యమున్న టీహెచ్‌సీ చైనా డెవలప్‌మెంట్‌ సంస్థకు సంబంధించి ఆ ఏడాది ప్రయాణ, కార్యాలయ నిర్వహణ వ్యయాల నిమిత్తం 84,000 డాలర్లు ఖర్చు చేసినట్లు పన్నుల పత్రాల్లో ఉందని వెల్లడించింది. చైనాలో ప్రాజెక్టుల కోసమే ఐదు చిన్న కంపెనీల్లో ట్రంప్‌ 192,000 డాలర్లు పెట్టుబడి పెట్టారని తెలిపింది. 2018 వరకూ ఆ సంస్థల ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు స్పష్టంచేసింది. అయితే దీనిపై ట్రంప్‌ సంస్థ న్యాయవాది స్పందిస్తూ ‘‘చైనాలో హోటల్‌ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని అక్కడ కార్యాలయం తెరిచాం. స్థానిక పన్నులు చెల్లించేందుకుగానూ అమెరికాలో శాఖలున్న ఓ చైనా బ్యాంకులో ఖాతా తెరిచాం. అయితే అక్కడ ఎలాంటి ఒప్పందాలు జరగకపోవడంతో వ్యాపారాలు నిర్వహించలేదు. 2015 నుంచి కార్యాలయం పనిచేయడం లేదు. ఖాతా ఇప్పటికీ ఉన్నా వేరే లావాదేవీల కోసం ఉపయోగించలేదు’’ అని తెలిపారు. 

ఇంటర్వ్యూను అర్ధాంతరంగా ముగించిన ట్రంప్‌
అధ్యక్షుడు ట్రంప్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ ఛానెల్‌ ప్రసారం చేసే సమయానికి ముందుగానే ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు.
 


మరిన్ని