పెన్సిల్వేనియాలోనూ ట్రంప్‌కు చుక్కెదురు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెన్సిల్వేనియాలోనూ ట్రంప్‌కు చుక్కెదురు

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల అపజయాన్నించి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి చుక్కెదురైంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆయన ప్రత్యర్థి జో బైడెన్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన కేసులను అక్కడి సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

హోరాహోరీ పోరు సాగిన రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో బైడెన్‌ 81 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. బైడెన్‌ విజయం సాధించినట్టు నవంబర్‌ 24న అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇక్కడి పోస్టల్‌ ఓట్లను చెల్లుబడి కానివిగా పరిగణించాలని.. విజేతను రాష్ట్ర శాసనసభ ఎన్నుకునేలా ఆదేశించాలని వారు వేర్వేరు పిటిషన్లలో కోరారు. 

కాగా, ఈ రెండు పిటిషన్లను ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టివేసింది. ఎన్నికల్లో ఓటువేసిన సుమారు 70 లక్షల పెన్సిల్వేనియా పౌరుల హక్కును రద్దుచేయాలనేది అసాధారణ ప్రతిపాదన అని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనితో ట్రంప్‌ పరాజయాన్ని అంగీకరించక తప్పదని మరోసారి వెల్లడైంది.


మరిన్ని