ప్రవాసాంధ్ర వైద్యుడు కొర్లిపర కృష్ణారావు కన్నుమూత
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రవాసాంధ్ర వైద్యుడు కొర్లిపర కృష్ణారావు కన్నుమూత

లండన్‌: యూకేలో సీనియర్‌ వైద్యుడిగా పనిచేసిన ప్రవాసాంధ్రుడు కొర్లిపర కృష్ణారావు (82) ఇక లేరు. లండన్‌లో దశాబ్దాల పాటు సేవలందించడంతో పాటు సృజనాత్మక ఆలోచనా ధోరణితో వైద్య రంగంలో పలు మార్పుల కోసం కృషిచేసిన ఆయన నవంబర్‌ 26న కన్నుమూశారు. తెలుగు కమ్యూనిటీ నుంచి జనరల్‌ మెడికల్ కౌన్సిల్‌లో సుదీర్ఘకాలం పాటు సభ్యుడిగా కొనసాగారు. కృష్ణా జిల్లా దెందులూరులో జన్మించిన డాక్టర్‌ కొర్లిపర కృష్ణారావు.. మణిపాల్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. అనంతరం 1964లో లండన్‌కు వెళ్లి అక్కడే పలు ఆస్పత్రులలో వైద్యుడిగా విశేష సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవర్సిస్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. మాంచెస్టర్‌లో భారతీయ విద్యాభవన్‌ శాఖ ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. బోల్టన్‌లో ఆయన ఓ నర్సింగ్‌ హోం నిర్వహించేవారు. డాక్టర్‌ కొర్లిపర కృష్ణారావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లండన్‌లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

డాక్టర్‌ కొర్లిపర మృతిపట్ల అక్కడి వైద్యులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. తెలుగు వారికి సంబంధించిన అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించారు.

- సమాచారం పంపినవారు: డాక్టర్‌ నగేశ్‌ చెన్నుపాటి

Tags :

మరిన్ని