అమెరికాలో వ్యాక్సినేషన్‌ దిశగా కీలక అడుగు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో వ్యాక్సినేషన్‌ దిశగా కీలక అడుగు!

వాషింగ్టన్‌: కొవిడ్‌ వ్యాప్తితో సతమతమవుతున్న అమెరికాలో భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ముందడుగు పడింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా విస్తృత వినియోగానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. కమిటీ సిఫార్సులకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలపగానే ప్రజలకు టీకా ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 16 ఏళ్లు, ఆపై వయసున్న పిల్లలు, పెద్దలకు అత్యవసర వినియోగానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా భద్రమైంది, సమర్థమైందని 17-4 ఓట్ల తేడాతో నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీలో ఒకరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. బ్రిటన్‌లో టీకా తీసుకున్న ఇద్దరు అలర్జీకి గురయ్యారనే వార్తల మధ్య నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

అమెరికా వ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య సగటున రెండు లక్షలకు చేరువగా నమోదవుతుండగా.. మృతుల సంఖ్య రోజుకి మూడు వేల పైనే నమోదవుతోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు కమిటీ ఆమోదం లభించింది. ఈ టీకాను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెలాఖరు కల్లా రెండున్నర కోట్ల డోసులను అందిస్తామని ఫైజర్‌ వెల్లడించింది. అయితే, తొలిదశలో టీకాను వైద్యారోగ్య, నర్సింగ్‌హోం, ఇతర అత్యవసర సిబ్బంది, వృద్ధులకు రిజర్వు చేసింది. అమెరికాలో సామూహిక రోగనిరోధకత రావాలంటే 70 శాతం మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. వచ్చేవారం మోడెర్నా తయారుచేస్తున్న కరోనా టీకాపై ఎఫ్‌డీఏ సమీక్ష నిర్వహించనుంది. 

ఇవీ చదవండి..

డబ్ల్యూహెచ్‌వో ఆందోళన నిజమైంది!

కొవిడ్‌ టీకాపై అపోహలొద్దుమరిన్ని