శ్వేతసౌధంలో మాస్కులు.. తప్పనిసరి కాదట!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
శ్వేతసౌధంలో మాస్కులు.. తప్పనిసరి కాదట!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియాతో సహా పలువురు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇంత జరిగినా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌లో మాస్కులు ధరించాలనే ప్రాథమిక కొవిడ్‌-19 నిబంధనను తప్పనిసరి చేయకపోవడం చర్చనీయాంశమైంది. శ్వేతసౌధంలో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసే ఆదేశాలేవీ ఇప్పటి వరకు జారీ కాలేదని ఓ సీనియర్‌ అధికారి వివరించారు. ఇక అధ్యక్షుడి సలహాదారు హోప్‌ హిక్స్‌కు కొవిడ్‌ లక్షణాలు బహిర్గతమైనప్పటికీ.. కనిపెట్టడంలో కరోనా పరీక్షా విధానం విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉపయోగిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షా విధానం స్థానంలో మరో కచ్చితమైన, విశ్వసనీయమైన విధానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశమేదీ లేనట్టు ఆయన తెలిపారు.

కాగా, ముఖానికి ముసుగు ధరించటం అనేది వ్యక్తిగత విషయమని ట్రంప్‌ గతంలో పలుమార్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ బహిరంగ సమావేశాల్లో మాస్క్‌ ధరించటాన్ని ఆయన ఎన్నో సార్లు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌, ఆయన ఎన్నికల ప్రచార బృదం కూడా కొవిడ్‌ మహమ్మారిని తేలికగా తీసుకున్నారని పలు విమర్శలు తీవ్రమవుతున్నాయి. ‘‘శాస్త్రవేత్తలు, వైద్యులు నెలల తరబడి పడ్డ శ్రమను అధ్యక్షుడు ట్రంప్‌ తుంగలో తొక్కారు. రాష్ట్రాలు, ప్రజలకు కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో సహాయపడటంలో ఆయన విఫలమయ్యారు. మాస్క్‌ వేసుకున్న వారిని ఎగతాళి చేయటమే కాకుండా.. సూపర్‌ స్ప్రెడర్లుగా మారే కార్యక్రమాలను చేపట్టి వేలాది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేశారు.’’ అని సెనేట్‌ సభ్యురాలు ఎలిజబెత్‌ వారెన్‌ ఈ సందర్భంగా  విమర్శించారు.మరిన్ని