ఫేస్‌బుక్‌లో ఇదే నా ఆఖరి రోజు..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫేస్‌బుక్‌లో ఇదే నా ఆఖరి రోజు..

కారణం ఇదేనంటూ ఉద్యోగి రాజీనామా

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌ సరైన మార్గంలో నడవటం లేదంటూ.. ఆ సంస్థ ఇంజినీర్‌ ఒకరు రాజీనామా చేశారు. సంస్థ ద్వేషం నుంచి లాభాలను పొందుతోందంటూ ఫేస్‌బుక్‌ను 28 ఏళ్ల యువ ఇంజనీర్‌ అశోక్‌ చంద్వానే అభిప్రాయపడ్డారు. ‘‘సుమారు ఐదున్నర సంవత్సరాల అనంతరం.. నేడు ఫేస్‌బుక్‌లో నా ఆఖరి రోజు. అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కూడా ద్వేష భావన నుంచి లాభం పొందాలనుకునే సంస్థలో భాగం కావటం ఇష్టం లేక నేను ఈ ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను’’ అని ఆయన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా తెలియచేశారు. హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు.. విద్వేష పూరిత, అసత్య సమాచార ప్రచారాన్ని నియంత్రించాల్సిందిగా కోరినా.. సంస్థ అందుకు తగిన చర్యలు తీసుకోకపోవటం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.

అయితే, తమ సంస్థ ఎప్పుడూ విద్వేషం వల్ల లాభం పొందలేదని ఫేస్‌బుక్‌ ప్రతినిధి లిజ్‌ బర్గేయస్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా సమాజ భద్రత కోసం సంస్థ మిలియన్ల డాలర్లు వెచ్చించినట్టు ఆమె తెలిపారు. నిపుణుల సూచనల మేరకు రాజకీయాలు, తదితర అంశాలను గురించిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నామని ఆమె వివరించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ మిలియన్ల కొద్దీ విద్వేష పూరిత పోస్టులను తొలగించిందని.. వాటిలో 96 శాతం ఏ ఫిర్యాదు రాకపోయినప్పటికీ తొలగించినవే అని లిజ్‌ వెల్లడించారు.


మరిన్ని