బ్రిటన్‌కు క్షమాపణలు చెప్పిన ఫౌచీ
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్రిటన్‌కు క్షమాపణలు చెప్పిన ఫౌచీ

లండన్‌: ఫైజర్‌ రూపొందించిన కరోనా టీకాకు బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతులిచ్చిన విధానంపై సందేహాలు వ్యక్తం చేసినందుకు అమెరికా ప్రముఖ వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ క్షమాపణలు చెప్పారు. బ్రిటన్‌ వ్యవస్థలపై తనకు పూర్తి స్థాయి విశ్వాసం ఉందన్నారు. ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి ఇటీవల బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. వచ్చేవారం ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీనిపై స్పందించిన ఫౌచీ.. టీకా అనుమతి విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వ వ్యవస్థలు తొందరపడినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. టీకా ప్రయోగాల సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలించడంలో బ్రిటన్‌ నియంత్రణా సంస్థలు మరింత కచ్చితంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. సీబీఎస్‌ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఫౌచీ వ్యాఖ్యలపై బ్రిటన్‌ మీడియాలో దుమారం రేగింది. దీంతో వెంటనే స్పందించిన ఫౌచీ బీబీసీతో మాట్లాడుతూ.. బ్రిటన్‌ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ‘‘నా వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుగా వెళ్లాయి. ఏదేమైనా నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు బ్రిటన్‌ శాస్త్రసాంకేతిక సంస్థలపై విశ్వాసం ఉంది. టీకా అనుమతిలో నిర్లక్ష్యం వహించారన్నది నా ఉద్దేశం కాదు. కానీ, నా వ్యాఖ్యల అర్థం ప్రజల్లోకి అలా వెళ్లిపోయింది. ఏదేమైనా టీకా సురక్షితమైనదే. ఇది కరోనాపై ప్రభావం చూపనుంది. అమెరికా, బ్రిటన్‌లోని ప్రజలు త్వరలోనే టీకా తీసుకోబోతున్నారు’’ అని ఫౌచీ వ్యాఖ్యానించారు.


మరిన్ని