అగ్రరాజ్యానికి పెను ముప్పే..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అగ్రరాజ్యానికి పెను ముప్పే..

ఇటీవలి సైబర్‌ దాడిపై అసాధారణ హెచ్చరిక జారీ

వాషింగ్టన్‌: అమెరికాలోని వివిధ ప్రభుత్వ శాఖలపై ఇటీవల జరిగిన సైబర్‌ దాడి ప్రభావం తీవ్రంగానే ఉండనుందని ఆ దేశ అధికార వర్గాలు భయపడుతున్నాయి. గుర్తుతెలియని హ్యాకర్లు మాల్‌వేర్‌ను వాడి ట్రెజరీ, వాణిజ్య, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ విభాగాలకు చెందిన కంప్యూటర్లను హ్యాక్‌ చేశారు. ఈ దాడికి కారకులను ఇంకా గుర్తించలేదు. అమెరికాపైనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల కంప్యూటర్‌ వ్యవస్థలపై రష్యా హ్యాకర్ల దాడి చాలాకాలంగా చాపకింద నీరులా సాగుతోందని అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సెక్యూరిటీ ఏజన్సీ వెల్లడించింది. ఈ దాడి ప్రభుత్వానికే కాకుండా ప్రైవేటు నెట్‌వర్క్‌లకు కూడా ప్రమాదమని ఓ అసాధారణ హెచ్చరిక జారీ చేసింది. కనిపెట్టేందుకు వీల్లేకుండా జరిగిన ఈ పకడ్బందీ దాడి ప్రభావం నుంచి కీలక ప్రభుత్వ శాఖలు, ఇతర వ్యవస్థలు బయటపడటం కష్ట సాధ్యమే అని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ట్రంప్‌కు కొత్త చిక్కు?

తన పదవీకాలం ముగియనున్న దశలో.. అధ్యక్షుడు ట్రంప్‌ శ్వేతసౌధం సైబర్‌ సెక్యూరిటీ సలహాదారును తొలగించటంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా 2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే వాదనలను ఆయన తేలికగా తీసుకోవటం కూడా ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో తాజా సైబర్‌ దాడికి ఘటనకు రష్యాయే కారణమని తేలితే ట్రంప్‌కు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. ఈ విషయమై అధ్యక్షుడు ట్రంప్‌ ఇంకా స్పందించాల్సి ఉండగా.. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఈ హ్యాకింగ్‌ ఘటన నిజానికి ఆందోళనకర అంశమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సైబర్‌ దాడిపై దర్యాప్తుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన ప్రకటించారు.

పలు అదనపు, అధునాతన చర్యల ద్వారా దాడికి గురైన 40కి పైగా సంస్థలు, ప్రభుత్వ శాఖలకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ దాడి నిజానికి చాలా తీవ్రమైనదని దీని నుంచి తేరుకోవటం అగ్రరాజ్యానికి పెద్ద సవాలే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఇవీ చదవండి

న్యూయార్క్‌ వణుకుతోంది..

ఫైజర్‌తో అమెరికాలో ఇద్దరికి అలెర్జీలు


మరిన్ని