బైడెన్‌ గెలిస్తే.. కమలనే అధ్యక్షురాలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ గెలిస్తే.. కమలనే అధ్యక్షురాలు

అధ్యక్ష పీఠంపైనే ఆమెకు మక్కువ: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని డెమొక్రాటిక్‌ నేత కమలా హారిస్‌ ఉవ్విళ్లూరుతున్నారని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ జో బైడెన్‌ గెలిచినా.. కమలనే అధ్యక్ష పీఠం ఎక్కుతారని ఆరోపించారు. చివరిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ విస్కాన్సిన్‌, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో  ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డెమొక్రాటిక్‌ పార్టీ ప్రత్యర్థులపై విమర్శల దాడికి దిగారు. 

కమలా హారిస్‌ అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని అనుకుంటున్నారని, జో బైడెన్‌కు ఓటు వేయకుండా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలని దుయ్యబట్టారు. ‘కమలా హారిస్‌ గురించి మీలో ఎవరికైనా తెలుసా? ఒక వేళ డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ ఎన్నికల్లో గెలిచినా.. నెల తిరిగే లోపు హారిస్‌ అధ్యక్షురాలి పదవి దక్కించుకుంటారు’ అని ఆరోపించారు. ‘కమల పేరును సరిగా పలకకపోతే ఆమెకు కోపం వస్తుంది. ‘కామా’ లాగా ఆమె పేరు కమల’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ తాజా ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్నారు. నిజానికి గతేడాది వరకు కమల అధ్యక్ష పదవి రేసులోనే ఉన్నారు. అయితే అమెరికన్ల మద్దతు తక్కువగా ఉండటంతో ఆ రేసు నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి కమలను బైడెన్‌ ఎంపిక చేశారు. 


మరిన్ని