అతను ‘ఏదో’ తీసుకుంటున్నాడు: ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అతను ‘ఏదో’ తీసుకుంటున్నాడు: ట్రంప్‌

ప్రత్యర్థి బైడెన్‌కు డ్రగ్స్‌ పరీక్షలు చేయాలని డిమాండ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులపై మరింత తీవ్రంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఇప్పటి వరకు పలువురు అభ్యర్థులు పోటీపడ్డారని.. అయితే బైడెన్‌ తీరు మరింత భయంకరమని, ఆయన అసమర్థుడని ట్రంప్‌ ఆరోపించారు.
తన ప్రసంగాలు మరింత ఆకట్టుకునేందుకు, చురుగ్గా ఉండేందుకు జో బైడెన్ డ్రగ్స్‌ మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన ఆరోపించారు. బైడెన్‌ ప్రవర్తనలో కొట్టొచ్చే విధంగా వింత వైఖరి కనిపిస్తోందని.. ఆయన ఎన్నికల ప్రసంగాలు మరింత పదునెక్కడం దాని ప్రభావమేనని ఇటీవల ఓ ముఖాముఖిలో ట్రంప్‌ వెల్లడించారు. అంతేకాకుండా సెప్టెంబర్‌ 29నాడు జరుగనున్న తొలిఎన్నికల ఉపన్యాసానికి ముందే బైడెన్‌కు మాదక ద్రవ్య నిర్ధారణ పరీక్ష చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అదే విధంగా తాను ఆ పరీక్షలకు సిద్ధమేనని 74 ఏళ్ల ట్రంప్‌ ప్రకటించారు.

బైడెన్‌ ప్రసంగాల్లో తడబడటం, విలేకరులు హఠాత్తుగా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు విముఖంగా ఉండటం కొంతమేరకు నిజమే. ఇందుకు కారణం ఆయన దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న నత్తి సమస్యే అని పలువురు భావిస్తారు. అయితే, తన ప్రత్యర్థి బైడెన్‌ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ట్రంప్‌ నమ్మించే ప్రయత్నం చేయటం గమనార్హం. ఈ క్రమంలో.. మానసికస్థితి సరిగాలేని వారు మన అధ్యక్షుడిగా ఉండకూడదని.. జో అటువంటి వారే అని పలుమార్లు విమర్శించారు. 


మరిన్ని