నా ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంది
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నా ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంది

కమలా హారిస్‌ విజయంపై మేనమామ స్పందన

దిల్లీ: అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హారిస్‌ విజయం పట్ల ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌ (80) సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీలోని మాల్వియానగర్‌లో నివాసముంటున్న ఆయన గత నాలుగు రోజులుగా టీవీకే అతుక్కుపోయినట్లు పేర్కొన్నారు. డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్‌ నిర్ణయాత్మక 270 ఎలక్టోరల్‌ ఓట్లు ఎప్పుడు సాధిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని తెలిపారు. ‘కమల విజయం పట్ల ఎంతో గర్వంగా ఉంది. త్వరలోనే ఆమెకు కాల్‌ చేసి అభినందనలు తెలియజేస్తా. ఫలితాలు వెల్లడైనప్పటినుంచి నా ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంది’ అని బాలచంద్రన్‌ పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది జనవరిలో జరగే మేనకోడలి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు కుటుంబసభ్యులతో కలిసి త్వరలోనే అమెరికాకు పయనమవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘నా కూతురు ప్రస్తుతం కమలతోనే ఉంది. ఎన్నికల ప్రచారంలో కమలకు తోడుగా నిలిచింది. ఇక్కడ ఉన్న కుటుంబసభ్యులమంతా త్వరలోనే అమెరికాకు ప్రయాణం కాబోతున్నాం. కమల ప్రమాణస్వీకారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్‌ కాబోము’ అని బాలచంద్రన్‌ స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్‌ విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా నిలిచారు. అగ్రరాజ్యం ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన అనంతరం కమల మాట్లాడారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మహిళల హక్కుల కోసం, వారి రక్షణ కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ పదవి అధిరోహిస్తున్న మొట్టమొదటి మహిళను తానే కావచ్చేమో కానీ చివరి మహిళను మాత్రం కానని ఆమె పేర్కొన్నారు.


మరిన్ని