బ్రేక్‌ఫాస్ట్‌లోనే దాన్ని మింగేస్తా.. :కమలా హారిస్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్రేక్‌ఫాస్ట్‌లోనే దాన్ని మింగేస్తా.. :కమలా హారిస్‌

న్యూయార్క్‌: జీవితంలో ముందుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోవద్దని కమలా హారిస్‌ మహిళలకు సలహా ఇస్తున్నారు. కెరీర్‌లో ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్నానని చెప్పిన ఆమె.. వాటిని పట్టించుకోకపోతేనే అనుకున్నది సాధించగలమని అంటున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఈ భారతి సంతతి మహిళ.. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు అడిగిన ప్రశ్నలకు  సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. భారతీయ వంటల్లో ఇడ్లీ సాంబార్‌ అంటే ఇష్టమని చెప్పిన కమలా.. ఇంకా ఏయే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పారో చూద్దాం..

ప్రశ్న: ఎన్నికల ప్రచార సమయంలో మానసిక ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు?

కమల హారిస్‌: చాలా చేస్తాను. ఉదయాన్నే వర్కౌట్లు.. ఆ తర్వాత పిల్లలతో సరదాగా ముచ్చట్లు. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు, డగ్‌(కమల భర్త)కు వంట ఎలా చేయాలో కూడా నేర్పిస్తా.

ప్రశ్న: భారతీయ వంటకాల్లో ఏమంటే ఇష్టం?

కమల: దక్షిణ భారతదేశంలో అయితే మంచి సాంబార్‌తో ఇడ్లీ అంటే ఇష్టం. ఇక ఉత్తరాదికి వస్తే.. ఎలాంటి టిక్కా అయినా నచ్చుతుంది.

ప్రశ్న: యువత, మహిళలకు మీరిచ్చే సలహా?

కమల: జీవితంలో ముందుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోకూడదు. ‘ఇది నీ సమయం కాదు.. ఇప్పుడు నువ్వు కాదు’ లాంటి తిరస్కారపు మాటలు నా కెరీర్‌లో ఎన్నో సార్లు విన్నా. నేను చెప్పేది ఒకటే.. ఈ కాదు(NO) అనే పదాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోనే తినేస్తా. మీకు కూడా అదే సిఫార్సు చేస్తా. ఎందుకంటే అదే మంచి బ్రేక్‌ఫాస్ట్‌.(తిరస్కారపు మాటలను పట్టించుకోకుండా ముందుకెళ్తేనే అనుకున్నది సాధిస్తాం అని తనదైన శైలిలో కమలా హారిస్‌ చెప్పారు).

ప్రశ్న: ఒక్క ఓటు ఫలితాలను మార్చగలదా?

కమల: ఒకటి రెండు ఓట్లు మొత్తం ఎన్నికల ఫలితాలనే మార్చేసిన ఘటనలు ఉన్నాయి. ఎన్నికల్లో మీ(ఓటర్లను ఉద్దేశిస్తూ) నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. 

ప్రశ్న: రానున్న తరాలకు స్థిరమైన, పర్యావరణహితమైన భవిష్యత్తును ఎలా అందిస్తారు?

కమల: ఇందుకోసం జో బైడెన్‌(అధ్యక్ష అభ్యర్థి) నేను ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. అనేక రంగాల్లో ఉద్యోగాలు సృష్టించడంతో పాటు 2050 నాటికి జీరో ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్నాం.
 మరిన్ని