అమెరికాను రక్షించండి..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాను రక్షించండి..

బైడెన్‌ తరపున భారతీయ పారిశ్రామికవేత్త ప్రచారం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లకు మద్దతుగా సిలికాన్‌ వ్యాలీకి చెందిన భారతీయ అమెరికన్‌ జంట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ డిజిటల్‌ గ్రాఫిక్‌ కార్యక్రమం 14 భాషల్లో కొనసాగుతుందని అజయ్‌, వినీతా భుటోరియా దంపతులు వెల్లడించారు. ‘‘ట్రంప్‌ హటావో అమెరికా బచావో’’ (ట్రంప్‌ను తొలగించు.. అమెరికాను రక్షించు).. ‘‘బైడెన్‌ హారిస్‌ కో జితావో, అమెరికా కో ఆగే బఢావో’’ (బైడెన్‌, హారిస్‌ను గెలిపించండి.. అమెరికాను ముందుకు నడిపించండి) అనే నినాదాలతో వీరు అక్కడి భారతీయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

హోరాహోరీ పోటీ నడిచే రాష్ట్రాల్లో ఫ్లోరిడాతో సహా అరిజోనా, జార్జియా, అయోవా, మెయిన్‌, మిషిగన్‌, మిన్నెసోటా, నెవాడా, న్యూ హాంప్‌షైర్‌, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విన్కాన్సన్‌లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటూ విలువైనదిగా భావించే ఈ స్వింగ్‌ స్టేట్స్‌లో భారతీయ అమెరికన్‌ ఓట్లు కీలకం కానున్నాయి. ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్‌’గా వ్యవహరించే ఈ పన్నెండు రాష్ట్రాలలో మొత్తం 127 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఉన్నాయి. దీనితో ఇక్కడి ఎన్నికల ఫలితాలు అధ్యక్ష అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నాయని పారిశ్రమికవేత్త అజయ్‌ అన్నారు.

ఈ నేపథ్యంలో ఆయా చోట్ల భారతీయులు, దక్షిణాసియా వాసులను ఆకట్టుకునేందుకు 14 భాషల్లో డిజిటల్‌ విధానంలో, ఫోన్‌ కాల్స్‌ ద్వారా కూడా తాము ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఇక్కడున్న 13 లక్షల పైగా భారతీయ అమెరికన్ల ఓట్లను బైడెన్‌కు అనుకూలంగా మార్చేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన ప్రకటించారు. కాగా వీరు గతంలో కూడా బైడెన్‌కు మద్దతుగా బాలీవుడ్‌ బాణీలలో పలు మ్యూజిక్‌ వీడియోలను విడుదల చేయటం విశేషం.



మరిన్ని