ట్రంప్‌కు భారతీయ అమెరికన్ల షాక్‌!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌కు భారతీయ అమెరికన్ల షాక్‌!

బైడెన్‌ వైపే వారి మొగ్గు అంటున్న తాజా సర్వే

వాషింగ్టన్: అమెరికాలో 26 లక్షలకు పైగా ఉన్న భారతీయ అమెరికన్ ఓటర్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. 12 రాష్ట్రాల్లో వీరి మొగ్గును బట్టి ఎన్నికల ఫలితాలు అతి స్వల్ప మెజారిటీతో మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు కాబోయే అధ్యక్షుడు ఎవరనేదీ నిర్ణయించడంలో కీలకం కాగలవని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లపై జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంతో సహా పలు సంస్థలు ఓ సంయుక్త సర్వేను చేపట్టాయి. ‘ఇండియన్‌ అమెరికన్‌ యాటిట్యూడ్స్‌ సర్వే’ (ఐఏఏఎస్) పేరిట నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ అమెరికన్‌ ఓటర్ల నాడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్‌ 1 నుంచి 20 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

అంచనాలకు విరుద్ధంగా..

ఈ సారి అధ్యక్షఎన్నికలో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే  జైకొడతామని 72 శాతం భారతీయ అమెరికన్లు చెబుతున్నారు. ఇక రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతిచ్చే భారతీయుల శాతం 22 శాతంగానే కొనసాగుతుండటం గమనార్హం. ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్‌ సత్సంబంధాలు, మోదీతో హ్యూస్టన్‌, అహ్మదాబాద్‌ సభల్లో ఒకే వేదికను పంచుకోవడం.. కశ్మీరు, సీఏఏ వ్యవహారాల్లో ఆయన తటస్థంగా ఉండడం వంటివి ఓటర్లను ఆకర్షిస్తాయని రిపబ్లికన్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. అయితే, వారి అంచనాలకు విరుద్ధంగా భారత్‌, అమెరికా సంబంధాలకు వీరు అంతగా ప్రాధాన్యమివ్వకపోవడం గమనార్హం. కశ్మీర్‌, సీఏఏ అంశాల్లో ట్రంప్‌ మౌనం వహించగా.. బైడెన్‌ భారత్‌పై విమర్శలు గుప్పించారు. అయినా ఇక్కడి భారతీయుల మద్దతు బైడెన్‌కే ఉండటం గమనార్హం. వీరి ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే మొత్తం 12 అంశాల్లో భారత్- అమెరికా సంబంధాలకు 11వ స్థానం దక్కడమే ఇందుకు కారణమని తెలిసింది. 

భారతీయ అమెరికన్లను ప్రభావితం చేసే అంశాల్లో ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వర్ణభేదాలు, పన్నులు, అవినీతి, వలస విధానం, పర్యావరణం, ఆర్థిక అసమానతలు, తీవ్రవాదం, విద్య వంటివి ఉన్నాయి. వీటిలో ఎక్కువ అంశాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉండటంతో భారతీయుల విషయంలో ఆయనకు ఎదురుగాలి వీయడం ఖాయం అని నిపుణులు అంటున్నారు. అధిక శాతం భారతీయులు డెమోక్రాటక్లకు ఓటేసేలా కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం దోహదపడుతుందని సర్వే అభిప్రాయపడింది.


మరిన్ని