దుబాయిలో భారత సంతతి విద్యార్థుల ఘనత
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దుబాయిలో భారత సంతతి విద్యార్థుల ఘనత

దుబాయి: 17 సంవత్సరాల భారత సంతతి విద్యార్థి కనిపెట్టిన ఓ యాప్‌, దుబాయిలో సంచలనం సృష్టిస్తోంది. వరుణ్‌ మిత్తల్‌ అనే ఈ బాలుడు తన తమ్ముడు అమన్‌తో కలసి ఓ సేవింగ్స్‌ కాలిక్యులేటర్‌ యాప్‌, కామిక్ సిరీస్‌ను కనిపెట్టాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని శ్రామికులకు ప్రయోజనం కలిగేలా అతను ఈ యాప్‌ను, కామిక్స్‌ను తయారుచేశాడు. వరుణ్‌  స్థానిక జుమేరియా కళాశాలలో 13వ తరగతి చదువుతుండగా.. అమన్‌ 11వ తరగతి చదువుతున్నాడు.
సమాజంలో ఆర్థిక పరిస్థితికి, మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా పనిచేసే ‘కాష్‌ కాష్‌’ అనే ఈ యాప్‌.. వ్యక్తులు తమ డబ్బు, ఖర్చులను బేరీజు వేసుకోవటానికే కాకుండా తాము ఎంత పొదుపు చేయవచ్చో తెలుపుతుంది. ఇక ‘ఇకోనోమిక్స్’ అనే కామిక్స్‌ ద్వారా ఆర్థిక వ్యవహారాలను అతి సులభంగా, బొమ్మల రూపంలో అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో వెలువడే ఈ కామిక్స్‌ పుస్తకాలను ఇప్పటికే యుఏఈ లోని కార్మిక శిబిరాలలో ఉండే శ్రామికులకు అందచేస్తున్నారు.

ఈ సందర్భంగా వరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు ఆర్థిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. సమాజంలో నాకున్న సౌకర్యాలు ఏవో నాకు తెలుసు. అయితే అందరికీ అవి లభించవు. కానీ మంచి జీవితాన్ని పొందడం అందరి హక్కు. అందుకే యుఏఈలోఉన్న యువతకు, శ్రామికులకు ఉపయోగపడేలా, వారు పొదుపు చేయటం ఎలాగో తెలుసుకొనేలా నేను ప్రయత్నించాను. ఆ యాప్‌ను వినియోగించి పొదుపు చేయటం వల్ల వారికి ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది.’’ అని వివరించాడు. పలు భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్‌ను వాడటం, అర్థం చేసుకోవటం చాలా సులభమని వరుణ్ తెలిపాడు.


మరిన్ని