బైడెన్‌ బర్త్‌డే: 78ఏళ్ల వయస్సులో అధ్యక్ష పీఠంపై‌!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ బర్త్‌డే: 78ఏళ్ల వయస్సులో అధ్యక్ష పీఠంపై‌!

అధిక వయసున్న అమెరికా అధ్యక్షుడిగా రికార్డ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తాజాగా 78 వసంతంలోకి అడుగుపెట్టారు. అమెరికా చరిత్రలోనే ఎక్కువ వయసున్న అధ్యక్షుడిగా జో బైడెన్‌ రికార్డుకెక్కనున్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బైడెన్‌, వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకుముందు, 1981-89 కాలంలో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న రొనాల్డ్‌ రీగన్‌కు అత్యధిక వయసు కలిగిన అధ్యక్షుడిగా రికార్డు ఉంది. 1989లో పదవీకాలం పూర్తయిన సమయం నాటికి రీగన్‌కు 77ఏళ్లు. తాజాగా రొనాల్డ్‌ రీగన్‌ రికార్డును జో బైడెన్‌ తిరగరాయనున్నారు.

అయితే, కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాకు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఒక సవాల్‌ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు కరోనాతో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్థం, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న అమెరికాను గట్టెక్కించడానికి బైడెన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరో రెండు నెలల్లోనే (జనవరి 20, 2021) ఆయన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుల వయస్సుపై తీవ్ర చర్చే జరిగింది. జో బైడెన్‌(78), ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్(74) ఇద్దరూ ఏడు పదుల వయస్సు దాటినవారే కావడం, వారి సమర్థతపై భిన్న వాదనలు వినిపించాయి. అయితే, బైడెన్‌ కంటే తక్కువ వయసున్న ట్రంప్‌, దీన్ని కూడా ప్రచారాస్త్రంగానే మార్చుకున్నారు. బైడెన్‌ వయస్సు, పాలనా సామర్థ్యాలపై ఎక్కుపెట్టిన ఆయన, స్లీపీ బైడెన్‌ అంటూ ప్రచారంలో విమర్శించారు. అధిక వయసున్న బైడెన్,‌ దేశాన్ని ముందుండి నడిపించడంలో విఫలమవుతారని ట్రంప్‌ అన్నారు. అయితే.. వయస్సును ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని ట్రంప్‌ పంపుతున్నారని జో బైడెన్‌ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రచారంలో దూసుకెళ్లిన బైడెన్‌ అమెరికన్ల మనసు గెలుచుకున్నారు. మరో రెండు నెలల్లో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు సిద్దమవుతున్నారు.మరిన్ని