ట్రంప్‌ సరే.. కమల, బైడెన్‌ సంగతేంటి?
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌ సరే.. కమల, బైడెన్‌ సంగతేంటి?

వారు చెల్లించిన పన్ను మొత్తం ఎంతంటే..

వాషింగ్టన్‌: అధ్యక్ష పదవికి ముందు నుంచే కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అంశం ఇటీవల బాగా చర్చనీయాంశమైంది. అయన గతంలో ఎన్నికల బరిలో నిలిచిన 2016, అధ్యక్షుడిగా ఉన్న 2017లోనూ పన్ను రూపంగా కేవలం 750 డాలర్ల చొప్పున చెల్లించినట్టు కథనాలు వెలువడ్డాయి. అసలు గత పదిహేను సంవత్సరాల్లో పదేళ్ల పాటు ఆయన ఏ విధమైన పన్ను చెల్లించలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి వర్గంలోని జో బైడెన్‌, కమలా హారిస్‌ల సంగతేంటనే ప్రశ్న పలువురిలో తలెత్తింది. ఈ నేపథ్యంలో వారిరువురూ తాము చెల్లించిన పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయటం గమనార్హం.

వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. డెమొక్రటిక్‌ అభ్యర్ధి బైడెన్‌ గత సంవత్సరం పన్ను రూపేణా అమెరికా ప్రభుత్వానికి 346,000 డాలర్లు చెల్లించారు. ఇది చెల్లించాల్సినదాని కంటే అధికం కావటంతో.. ప్రభుత్వం ఆయనకు  47,000 డాలర్లు తిరిగి చెల్లించింది. కాగా అదే సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాలకు ఆయన 14,700 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇక ఆయన పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కమలా హారిస్‌, ఆమె భర్త డగ్లస్‌ ఎంహాఫ్‌ సంయుక్తంగా 1,185,628 డాలర్లు చెల్లించినట్టు తెలిసింది. ఇక వీరిరువురూ 35,390 డాలర్ల విరాళాన్ని వివిధ కార్యక్రమాలకు అందచేశారు.

కాగా ట్రంప్‌ పన్ను ఎగవేతను గురించి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో పరిస్థితిని.. రానున్న ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలంగా మలచుకునేందుకే బైడెన్‌, కమలా హ్యారిస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని