క్లూనీ చెప్పారు సారీ!
క్లూనీ చెప్పారు సారీ!

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను అనుచితంగా సంబోధించిన బ్రిటన్‌ ఎగువసభ సభ్యుడొకరు కంగుతిన్నారు. ఆమెను ‘ఇండియన్‌’ అంటూ 82 ఏళ్ల లార్డ్‌ కిల్‌క్లూనీ చేసిన ట్విటర్‌ వ్యాఖ్యల పట్ల సభాపతితో సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి.. హారిస్‌కు మద్దతుగా నిలిచారు. దీనితో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియా సంతతి వ్యక్తిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ‘‘బైడెన్‌ తరువాత ఈ ఇండియన్‌ అధ్యక్షురాలైతే ఏమౌతుంది?అప్పుడు ఎవరు ఉపాధ్యక్షుడౌతారు?’’ అంటూ కిల్‌క్లూనీ చేసిన ట్వీట్ పట్ల దుమారం రేగింది. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కమలకు క్షమాపణ చెప్పాల్సిందిగా స్పీకర్‌ నార్మన్‌ ఫౌలర్‌ కిల్‌క్లూనీని ఆదేశించారు.

ఇందుకు లార్డ్‌ ఫౌలర్‌ అంగీకరించి ‘‘బైడెన్‌ తన ఐర్లాండ్‌ వారసత్వం పట్ల గర్వించినట్టుగా, హారిస్‌ తన భారతీయ వారసత్వం పట్ల గర్వించడం సరైనదే. ఇండియన్‌ అని నేను చేసిన వ్యాఖ్య కొందరిని బాధించి ఉండవచ్చు. ఆమె పేరు తెలియనందున నేను ఆమెను ఆ విధంగా సంబోధించాను. ఈ సంగతి చాలా మందికి అర్థం అయిందని నేను భావిస్తున్నాను. ఆమెను ఉద్దేశించి నేను చేసిన సంబోధనను ఉపసంహరించుకుంటున్నాను. జాత్యహంకారానికి నేను వ్యతిరేకం.’’ అని ఆయన వివరణ ఇచ్చారు.


Advertisement

Advertisement


మరిన్ని