3 రాజధానులు చారిత్రక తప్పిదం: జయరాం కోమటి
3 రాజధానులు చారిత్రక తప్పిదం: జయరాం కోమటి

అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం 

వాషింగ్టన్‌: ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవాలి గానీ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వేలాది మంది రైతుల జీవితాలను, కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ను కాలరాసేలా వ్యవహరించడం నియంతృత్వానికి పరాకాష్ఠ అని ఎన్నారై జయరాం కోమటి అన్నారు. ఇటీవలే ఆయన నేతృత్వంలో ‘అమరావతి కోసం ఎన్నారైలు’ పేరిట 200వ రోజున పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో జయరాం కోమటి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల నిర్ణయం ఓ చారిత్రక తప్పిదమని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన రోజును రాష్ట్రానికి దుర్దినమన్నారు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా ఆచరణలో సాధ్యం కాలేదని, అది ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

దేశంలో ఆదాయం పరంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణ ముందంజలో ఉన్నాయని, దీనికి కారణం ముంబయి, చెన్నై, కోచి, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలు ఉపాధి, ఉద్యోగావకాశాలకు కేంద్రాలుగా ఉండటమేనన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భావితరాలకు దారిచూపేలా మహానగర నిర్మాణానికి ప్రణాళిక రచించారన్నారు. దీంతో మూడు పంటలు పండే భూములను అమరావతి రైతులు రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం మాట నమ్మి తమ పొంటపొలాలను ఇవ్వడం  కేవలం త్యాగం మాత్రమే కాదని, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకమని తెలిపారు.

కానీ ఈరోజు సీఎం జగన్‌ దేశానికి ఓ చెడు మార్గాన్ని చూపించారని, ప్రభుత్వాల మాటకు, ఒప్పందాలకు విలువ ఉండదని నిరూపించారని ధ్వజమెత్తారు. దీనివల్ల దేశం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు గ్యారెంటీ లేకపోతే దేశంలో ఏ పౌరుడూ ఇకపై ప్రభుత్వాలను నమ్మరని, ఒప్పందాలను గౌరవించరని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం పెరగడంతో పాటు సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమరావతి రైతులకు ఎన్నారైలు అండగా నిలిచి న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగం కంటే దేశంలో ఏదీ శక్తిమంతమైనది కాదని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టుల ద్వారా అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని జయరాం విశ్వాసం వ్యక్తంచేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా వెలుగొందుతుందని చెప్పారు.

Tags :

మరిన్ని