మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్‌ హామీ!
మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్‌ హామీ!

దేశాధ్యక్షుడితో సమావేశమైన డా. జయరాం నాయుడు

టెక్సాస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ట్రంప్ టెక్సాస్‌లోని ఒడెస్సాకు వచ్చారు. నిధుల సేకరణ కార్యక్రమం కోసం ట్రంప్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ట్రంప్‌ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రానికి చెందిన డాక్టర్ జయరాం నాయుడు హాజరయ్యారు. దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయి దాదాపు 30 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. హెచ్1బీ వీసాలపై ఉన్న అర్హత కలిగిన ఫిజీషియన్లకు గ్రీన్ కార్డు ఇచ్చే అంశాన్ని వేగవంతం చేయాలని జయరాం నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పట్ల ట్రంప్‌ పాజిటివ్‌గా ఉన్నట్లు జయరాం నాయుడు తెలిపారు. అమెరికన్లకే ఉద్యోగాలు నినాదంతో ట్రంప్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఆ దిశగా అడుగులు వేశారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి, ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ట్రంప్‌ విదేశీయులకు షాకిచ్చే ఎన్నో చర్యలు తీసుకున్నారు. తాజాగా మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌పై హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags :

మరిన్ని