లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం  

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డ్ 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని సిలికానాంధ్ర తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాలం వేదికగా జూమ్‌లో లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చిన్నా, పెద్దా  తేడా లేకుండా అందరూ గొంతు కలిపి ఈ అద్భుత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గొప్ప విశేషమే కాకుండా సాంకేతికంగానూ మహత్కార్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరికీ మనో బలంతో పాటు సామాజిక స్థైర్యం, శాంతి నెలకొనాలని వారి ఆశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ ప్రపంచం కరోనా నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. హనుమంతుడికి బుద్ధి, బలం, పరాక్రమం కలగలసిన శక్తి ఉందని, అది ప్రజలందరికీ కావాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా దైవ శక్తి, మానవ శక్తి కలగలిసి మహా చైతన్యంగా ఏర్పడి కొవిడ్‌-19పై విజయం సాధించాలని సంస్థ సభ్యులు అభిలాషించారు. అలాగే ఇందులో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావితరాలకి అందిస్తోందని, అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించడం విశేషమని కొనియాడారు. రామ నామం స్మరించడం మంచిదని, అది రాళ్ళనైన తేలిక చేసి సముద్రంలో వారథినైనా నిర్మిస్తుందని చెప్పారు. తద్వారా ప్రజా సమస్యల కోసం రాముడి నామం జపించి కరోనాని జయిద్దామని అన్నారు. లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకోవడం మరో విశేషం. కూచిభొట్ల ఆనంద్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ బృహత్కార్యంలో సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చామర్తి, మధుబాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతి చింతలపూడి, స్నేహ వేదుల తదితరులు పాల్గొన్నారు. అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని సాంకేతిక సహాయం అందజేశారు


మరిన్ని