ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ట్రంప్‌ సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో వీరు పరీక్షలు చేయించుకున్నారు. తాము క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. తన సలహాదారు హోప్‌ హిక్స్‌ విరామం లేకండా విధుల్లో నిరంతరం నిమగ్నమై ఉండటంతో కొవిడ్‌-19 వచ్చిందని.. ఇది చాలా విచారకరమని అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నామని.. ఫలితాల్లో పాజిటివ్‌ అని తేలినట్లు వెల్లడించారు. 

కాగా, తాను బాగానే ఉన్నానని.. అధ్యక్షుడిగా తన బాధ్యతలను ఏ అంతరాయం లేకుండా నిర్వహిస్తానని ట్రంప్‌ వివరించారు.  అందరం కలసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన అమెరికన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా,  తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటున్నట్టు  మెలానియా తెలిపారు. అందరూ అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ఆమె కోరారు. ట్రంప్‌ దంపతుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. వారు శ్వేత సౌధంలో క్వారంటైన్‌ కాలాన్ని గడపనున్నారని వైద్యుడు సీన్‌ కాన్లే ప్రకటించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెలరోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఈ పరిస్థితి తలెత్తడం ట్రంప్‌ విజయావకాశాలపై ప్రభావం చూపగలదని పరిశీలకులు అంటున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తన స్నేహితుడు ట్రంప్‌, ఆయన సతీమణి త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.మరిన్ని