అమెరికా ఎన్నికల వేళ.. భద్రత ఇలా..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా ఎన్నికల వేళ.. భద్రత ఇలా..

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన  అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దశాబ్దాల తరబడి  ప్రశాంతంగానే జరుగుతూ వచ్చాయి. అయితే ఈమధ్య చోటుచేసుకున్న కరోనా మహమ్మారి, వర్ణవివక్ష నిరసనలు తదితర పరిణామాల వల్ల ఆ దేశంలో అశాంతి, భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓడినట్లయితే అధికార బదలాయింపు శాంతియుతంగా ఉండగలదనే హామీ ఇచ్చేందుకు స్వయానా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపే నిరాకరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు  రణరంగానికి వేదిక కాగలవనే భయం అమెరికన్లలో వ్యక్తమౌతోంది. పోలింగ్‌ గంటల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచార పర్వం ముగిసి భద్రతా చర్యలు ఊపందుకున్నాయి. ఎన్నికల పర్యవసానంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినా  ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన  ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు, దీపస్థంభాలు తదితరాలపై హెచ్చరిక చిహ్నాలను ఏర్పాటుచేశారు.

అవాంఛనీయ ఘటనల సమాచారం లేదు

కాగా,  రాజధాని వాషింగ్టన్‌లో  అధ్యక్ష నివాసం శ్వేతసౌధం చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రదర్శనకారులు దానిపై ట్రంప్‌ వ్యతిరేక ప్లకార్డులను ఏర్పాటు చేయటం గమనార్హం. ఇక ఇక్కడి వ్యాపార, వాణిజ్య వర్గాలు దుకాణాలను మూసివేశాయి.   అదనపు భద్రతా ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగనున్నట్టు తమకు నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారమేదీ లేదని నగర ఉపమేయర్‌ జాన్‌ ఫాల్సిచినో తెలిపారు. అయితే తాము అప్రమత్తంగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఇక్కడి భవనాల స్వంతదారులు, వ్యాపారస్తుల భయాందోళనలను తాము అర్థం చేసుకోగలమని.. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యంత పటిష్ఠమైన ఏర్పాట్లు ఉన్నాయని ఉపమేయర్‌ వివరించారు. 


మరిన్ని