హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌గా శ్రీకాంత్‌ దాతార్‌
హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌గా శ్రీకాంత్‌ దాతార్‌

వాషింగ్టన్‌: 100ఏళ్లకు పైగా చరిత్ర గల హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ (హెచ్‌బీఎస్) డీన్‌గా భారత సంతతికి చెందిన శ్రీకాంత్‌ దాతార్‌ నియమితులయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఈ సంస్థ డీన్‌గా దాతార్‌ నియామకం జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈయన నితిన్‌ నోహ్రియా నుంచి ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. దాతార్‌ సృజనాత్మక విద్యావేత్త, గొప్ప పండితుడు, అత్యుత్తమ దార్శినికుడని ఈ సందర్భంగా బోస్టన్‌, మసాచూసెట్స్‌లో నెలకొన్న ఈ విశ్వవిద్యాలయం ప్రశంసించింది.

చార్టెడ్‌ అకౌంటెంట్‌ కూడా..

దాతార్‌, ముంబయి విశ్వ విద్యాలయానికి చెందిన సెయింట్‌ జేవియర్‌ కళాశాలలో గణితం, ఆర్థిక శాస్త్రాలతో పట్టభద్రుడయ్యారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ కూడా అయిన ఈ విద్యావేత్త.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమా పూర్తి చేశారు. అనంతరం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ కొనసాగించారు. 1984 నుంచి 1989 వరకు కార్నెజ్‌ మెల్లాన్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో ఆచార్యునిగా సేవలందించారు. 1996లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆచార్య బృందంలో చేరారు. 2015 నుంచి హార్వర్డ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ (ఐ ల్యాబ్స్) అధ్యక్షుడిగా వ్యవహరించటం ఆయన నిర్వహించిన ఉన్నత పదవుల్లో ఒకటి.

25 ఏళ్లకు పైబడిన అనుబంధం

‘‘శ్రీకాంత్‌ దాతార్‌ హెచ్‌బీఎస్ భవిష్యత్తును నడిపించగల ఆలోచనాశాలి. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల తలెత్తిన ఎన్నో సవాళ్లను సంస్థ సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్య పాత్ర పోషించారు. మా సంస్థతో 25 సంవత్సరాల పైబడిన అనుబంధంతో అనేక కీలక పదవులను అలంకరించారు. తనకు గల విస్తృత, అంతర్జాతీయ స్థాయి అవగాహన, దృఢ సంకల్పంతో అనేక జాతులతో కూడిన వైవిధ్యభరితమైన, సమగ్రమైన హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నిర్మాణానికి దోహదపడతారని మా నమ్మకం.’’ అని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ దాతార్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ పదవి లభించడం నాకు దక్కిన గౌరవమని వినయపూర్వకంగా భావిస్తున్నాను. పరిశోధన, విద్య, అభ్యాసం తదితర రంగాల్లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు గుర్తించదగిన ఘనచరిత్ర ఉంది. హార్వర్డ్‌, బోస్టన్‌లలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బంది, స్నేహితులతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’ అని వెల్లడించారు.

Advertisement

Advertisement


మరిన్ని