సుధా నారాయణన్‌కు అమెరికా పౌరసత్వం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సుధా నారాయణన్‌కు అమెరికా పౌరసత్వం

అత్యంత అరుదుగా జరిగే పౌరసత్వ ప్రదానోత్సవానికి హాజరైన ట్రంప్‌

న్యూయార్క్‌: భారత్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సుధా సుందరి నారాయణన్‌కు సహజీకరణ విధానం(నాచురలైజేషన్‌ ప్రాసెస్‌) ద్వారా అమెరికా పౌరసత్వం లభించింది. అత్యంత అరుదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా పర్యవేక్షించారు. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక అధిపతి శ్వేతసౌధంలో మంగళవారం నారాయణన్‌తో పౌరసత్వ ప్రదాన ప్రమాణం చేయించారు. నారాయణన్‌తో పాటు బొలీవియా, లెబనాన్‌, సుడాన్‌, ఘనా దేశానికి చెందిన మరో నలుగురికి కూడా ఈ విధానంలో అగ్రరాజ్య పౌరసత్వం లభించింది.

ఈ సందర్భంగా సుధా సుందరి నారాయణన్‌పై ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. 13 ఏళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చిన నారాయణన్‌ ‘అద్భుతమైన విజయాని’కి చిహ్నంగా నిలిచారని కొనియాడారు. ‘‘సుధా అత్యంత ప్రతిభగల ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబానికి నా శుభాభినందనలు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సుధా నారాయణన్‌ భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబింపజేసేలా చీరకట్టులో ట్రంప్‌ నుంచి పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందుకొన్నారు. 

ట్రంప్‌ వలస విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ కార్యక్రమం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చట్టబద్ధంగా దేశంలోకి అడుగుపెట్టిన వారికి అమెరికాలో ప్రాధాన్యం లభిస్తుందన్న సందేశం పంపి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ట్రంప్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పౌరసత్వ ప్రమాణంతో ఐదుగురు పౌరులు అమెరికా రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ట్రంప్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పౌరసత్వంతో పాటు హక్కులు, విధులు, బాధ్యతలు కూడా సంక్రమిస్తాయని తెలిపారు. అమెరికా పౌరులుగా మారడం గొప్ప విజయంగా అభివర్ణించిన ఆయన ప్రపంచంలోని అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకునే అరుదైన అవకాశం లభించిందని చెప్పుకొచ్చారు. భూమిపై అద్భుత దేశమైన అమెరికా పౌరసత్వం పొందడం గొప్ప విజయమని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అమెరికా ప్రథమ పౌరురాలు మెలనియా ట్రంప్‌ కూడా పాల్గొన్నారు. ఆమె కూడా ఒకప్పుడు స్లొవేనియా నుంచి వలస వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అవకాశాలకు అడ్డాగా ఉన్న అమెరికాలో పనిచేయడం గొప్ప వరంగా భావించిన తాను అక్కడి పౌరసత్వం కోసం ఎంతో కష్టపడ్డట్లు తెలిపారు.


మరిన్ని