డిసెంబర్‌ 5 నుంచి  తానా సురభి నాటకోత్సవాలు 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
డిసెంబర్‌ 5 నుంచి  తానా సురభి నాటకోత్సవాలు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిరక్షణకు ఎల్లప్పుడూ కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం కరోనా‌ కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న రంగస్థల నటులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. నాటక ప్రదర్శనల్లో పేరుగాంచిన సురభి కళాకారులు ప్రదర్శనల్లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు వీలుగా నాటక ప్రదర్శనల ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని తానా నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 5 నుంచి 27 వరకు తానా సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

తానా అధ్యక్షుడు జై‌ తాళ్లూరి ఆధ్వర్యంలో కార్యదర్శి రవి పొట్లూరి, తెలంగాణా రాష్ట్ర మాజీ సాంస్కతిక సంచాలకులు విజయభాస్కర్‌, తానా కల్చరల్‌ కోఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రా, తానా ఉమెన్స్‌ కోఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల పర్యవేక్షణలో ఈ సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీనివాస కళ్యాణం, మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణ లీలలు, భక్త ప్రహ్లాద, పాతాళ భైరవి, శ్రీకృష్ణ తులాభారం, సతీ సావిత్రి, బాలనాగమ్మ తదితర నాటకాలను ప్రదర్శిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జై తాళ్లూరి వివరించారు. ఈ ప్రదర్శనలను అందరూ తిలకించాలని, నాటక రంగ కళాకారులను ఆదుకొనేందుకు అందరూ ముందుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


మరిన్ని