హెచ్‌-1బీ లాటరీ పద్ధతికి ట్రంప్‌ స్వస్తి!
హెచ్‌-1బీ లాటరీ పద్ధతికి ట్రంప్‌ స్వస్తి!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాల జారీలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్‌ పాలక వర్గం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ పెట్టింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయొచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) వెల్లడించింది. 

అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొంతకాలంగా హెచ్‌-1బీ వీసాల జారీలో అనేక కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్‌ సర్కార్‌ ఇప్పుడు లాటరీ పద్ధతికి కూడా స్వస్తి చెప్పబోతోంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటిచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ గతంలోనే తెలిపింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా హెచ్‌-1బీ వీసాలు జారీ చేయాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. 

ఏంటీ కొత్త విధానం..

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తుంటారు. అయితే ఈ విధానం ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండంతో స్థానికులకు అవకాశాలు లభించడం లేదని ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తోంది. అందుకే వీసాల జారీలో భారీ సంస్కరణలు చేపడుతోంది. లాటరీ పద్ధతిని రద్దు చేస్తూ పాలకవర్గం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే.. ఇకపై అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా హెచ్‌-1బీ వీసాలు జారీ చేయనుంది. 

అంటే.. అత్యధిక వేతనాలు లభించే, అధిక నైపుణ్యం గల ఉద్యోగులకు పెద్ద పీట వేస్తూ వీసాల జారీ ప్రక్రియ ఉండనుంది. దీని వల్ల ప్రతిభ గల వారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుందని, అంతేగాక అమెరికన్లకు ఉద్యోగ భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల జారీని డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా నిషేదిస్తూ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ట్రంప్‌నకు ఎలా కలిసొస్తాయో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..!


Advertisement

Advertisement


మరిన్ని