కరోనాపై ట్రంప్‌ సలహాదారు రాజీనామా!
కరోనాపై ట్రంప్‌ సలహాదారు రాజీనామా!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్న డాక్టర్‌ స్కాట్‌ అట్లాస్‌ చివరకు రాజీనామా చేశారు. అమెరికాలో వైరస్‌ తీవ్రతకు అడ్డకట్ట వేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. 

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్నవేళ.. నాలుగు నెలల క్రితం ఆయన అధ్యక్షుడికి సలహాదారుగా నియమితులయ్యారు. ప్రజారోగ్యం, అంటువ్యాధులపై ఎలాంటి అనుభవం లేని వ్యక్తి కావడంతో ఆయన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా, మాస్కులు ధరించడాన్ని ప్రశ్నించిన ఆయన.. కరోనా కట్టడికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలున్నాయి. కేవలం హెర్డ్‌ ఇమ్యూనిటీని ప్రోత్సహించిన స్కాట్‌ అట్లాస్,‌ లాక్‌డౌన్‌ వంటి చర్యలను వ్యతిరేకించారు.

అమెరికా అధ్యక్షుడికి తప్పుదోవ పట్టించే విధంగా డాక్టర్‌ స్కాట్‌ అట్లాస్‌ సూచనలు చేస్తున్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీతో పాటు సీడీసీ కూడా ఆరోపించింది. ఒకనొక సమయంలో మాస్కుల ప్రాముఖ్యతను తగ్గిస్తూ ఆయన చేసిన ట్వీట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన ట్వీట్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ట్విటర్‌ వాటిని తొలగించడం గమనార్హం. ఇక వైట్‌హౌస్‌లోనూ వైరస్‌ తీవత్ర పెరగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమనే అభిప్రాయం అక్కడి అధికారుల్లో వ్యక్తమయ్యింది. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్షుడికి కరోనా విభాగ సలహాదారుగా తాను రాజీనామా చేస్తున్నట్లు స్కాట్‌ అట్లాస్‌ ప్రకటించారు.

ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటివరకు కోటి 35లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 2లక్షల 68వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


మరిన్ని